సభ్యుల మెడికల్ బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలి: అయ్యన్నపాత్రుడు చింతకాయల

Must read

ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు, శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చింతకాయల అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతిలోని శాసన సభ ప్రాంగణంలో శాసన మండలి, శాసన సభ సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతిభద్రతలు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను సమీక్షించేందుకు సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, సాధారణా పరిపాలనా శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, అదనపు డీజీపీ మధుసూదన రెడ్డితో వారు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

పెండింగ్ ప్రశ్నలకు సత్వరమే సమాధానాలు…
ఈ సందర్భంగా శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు, శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చింతకాయల మాట్లాడుతూ, సభా సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు నిర్ణీత సమయంలో సమాధానాలు అందించడం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని పేర్కొన్నారు. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల నుంచి సకాలంలో, స్పష్టంగా, సమగ్రంగా సమాధానాలు అందేలా పటిష్టమైన సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమాధానం ఇవ్వడానికి వీలుకాని ప్రశ్నలు ఏవైనా ఉంటే, అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ సంక్షిప్త సమాధానం అందించాలని సూచించారు.

అదేవిధంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలను సమీక్షించి, వాటిపై తగిన నిర్ణయం తీసుకోవాలని, అవసరమైన చోట చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించి పెండింగ్ జాబితా నుంచి తొలగించే ప్రక్రియను చేపట్టాలని సూచించారు. శాసన మండలి, శాసన సభల గౌరవాన్ని, సభ్యుల హక్కులను దృష్టిలో ఉంచుకుని ప్రశ్నలకు సమాధానాల ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

శాసన మండలి, శాసన సభ సభ్యులకు సంబంధించిన సంక్షేమ అంశాలపై కూడా వారు అధికారులతో చర్చించారు. సభ్యుల పెండింగ్ మెడికల్ బిల్లుల చెల్లింపులను సత్వరమే పరిష్కరించి, అర్హత కలిగిన క్లెయిమ్‌లకు ఎటువంటి జాప్యం లేకుండా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెడికల్ బిల్లుల పరిష్కారంలో ఏవైనా పరిపాలనా లేదా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

అదేవిధంగా సభ్యుల పింఛను సొమ్మును పెంచేందుకు పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను కూడా సత్వరమే పరిశీలించి, అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి ఒక కొలిక్కి తీసుకురావాలని శాసన మండలి అధ్యక్షులు, శాసన సభ స్పీకర్ అధికారులకు సూచించారు. సభ్యుల పింఛను పెంపు అంశానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ప్రతిపాదనల స్థితిగతులు, అవసరమైన పరిపాలనా చర్యలు, ఆర్థికపరమైన అంశాలను సమీక్షించి, వీలైనంత త్వరగా తగిన నిర్ణయానికి రావాలని ఆదేశించారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా లోపాలపై ప్రత్యేక దృష్టి…
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లలో ఎక్కడైనా లోపాలు, గ్యాప్‌లు ఉన్నాయో ముందుగానే గుర్తించి వాటిని పూర్తిస్థాయిలో సరిదిద్దాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చింతకాయల పోలీస్ అధికారులకు సూచించారు.

సచివాలయం చుట్టూ విస్తృతంగా ఖాళీ ప్రాంతాలు ఉన్నందున, భద్రతాపరంగా ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. సచివాలయం, శాసన మండలి, శాసన సభ ప్రాంగణాల నాలుగు వైపులా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు, అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థలను వినియోగించి నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.

సీసీటీవీ కెమెరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ భద్రతను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది ఎటువంటి ఏమరపాటుకు తావులేకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి అంశాన్ని ముందుగానే అంచనా వేసి అవసరమైన చర్యలు చేపట్టాలని స్పీకర్ ఆదేశించారు.

సభా సమావేశాలు జరిగే సమయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, సందర్శకుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా, అదే సమయంలో భద్రతా ప్రమాణాల్లో ఎటువంటి రాజీ లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు.

ఈ సమావేశాల్లో శాసన సభ డిప్యుటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణరాజు, శాసన సభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, గుంటూరు ఎస్.పీ. వకుల్ జిందాల్, సీఎం సెక్యూరిటీ ఎస్.పీ. భద్రయ్య, జాయింట్ సెక్రటరీ విజయరాజు, డిప్యూటీ సెక్రటరీ వనితా రాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!