బనగానపల్లె పట్టణంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. పనులకు వెళ్లిన తల్లిదండ్రుల వద్ద నుంచి ఇంటికి వస్తున్న బాలికను రవితేజ అనే యువకుడు బ్రిడ్జి కిందికి బలవంతంగా లాక్కెళ్లాడు. ఆమెపై అఘాయిత్యానికి యత్నిస్తూ, దవడపై పళ్లతో కొరికి పైశాచికంగా దాడి చేశాడు.
వెంటనే అక్కడే ఉన్న బాలిక తమ్ముడు కేకలు వేయడంతో స్థానికులు స్పందించి నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలైన బాధిత బాలికను చికిత్స నిమిత్తం బనగానపల్లె ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కల్పన తెలిపారు.
బనగానపల్లెలో 13 ఏళ్ల బాలికపై జరిగిన అఘాయిత్య యత్నం ఘటనపై జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించింది. బాధితురాలికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని నంద్యాల జిల్లా ఉమెన్ అండ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) లీలావతి దేవి భరోసా ఇచ్చారు. ఆమె బనగానపల్లె ఏరియా ఆసుపత్రికి వెళ్లి, చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి బాలిక ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యం తదితర వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. బాధితుల పరిహార పథకం కింద బాధిత బాలికకు ప్రభుత్వం తరపున రూ. లక్ష రూపాయల ఆర్థిక సాయం అందుతుందని వెల్లడించారు.
ఇందులో భాగంగా తక్షణ సాయంగా మొదటి విడత కింద రూ. 25 వేలు అందజేస్తామని, పోలీసుల విచారణ పూర్తయి కేసు ఛార్జిషీట్ దాఖలైన వెంటనే మరో రూ. 25 వేలు ఇస్తామని తెలిపారు. అలాగే నిందితుడికి న్యాయస్థానంలో శిక్ష ఖరారైన వెంటనే మిగతా రూ. 50 వేలు అందజేస్తామని ఆమె వివరించారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున బాధిత బాలికకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ దారుణ ఘటనపై నంద్యాల జిల్లా కలెక్టర్ కూడా సీరియస్గా ఉన్నారని, శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారని పీడీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పీడీ ఈఓ అనురాధ, సీడీపీఓ సూపర్వైజర్, సి.నాగ సుంకమ్మ, సూపర్వైజర్ వి.చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు.





