ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ఆధ్వర్యంలో ఫుల్ బెంచ్ సమక్షంలో ఘన వీడ్కోలు పలికారు.హై కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి పదవీ విరమణ చేయనున్న సందర్భాన్ని పురష్కరించుకుని హైకోర్టు మొదటి కోర్టు హాల్లో శుక్రవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి నిబద్ధత కలిగిన న్యాయమూర్తని కొనియాడారు.జస్టిస్ చక్రవర్తి తన పదవీ కాలంలో అనేక కీలకమైన తీర్పులను వెలువ రించారని న్యాయ వ్యవస్థకు విశేష సేవలందించారని అభినందించారు.ఐటీ రంగంలో ప్రభజంనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంబకోణం కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తిగా చారిత్రాత్మక తీర్పును ఇచ్చారన్నారు.
ప్రధాన నిందితుడితో పాటు 10 మందికి 7 సంవత్సరాల శిక్షను విధించి కీలకమైన తుది తీర్పును వెలువరించారని వివరించారు.జస్టిస్ చక్రవర్తి సివిల్, క్రిమినల్ మరియు పబ్లిక్ సర్వెంట్ మిస్కండక్ట్ వంటి అనేక కేసులను విచారించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. జస్టిస్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కందులపాలెం గ్రామంలో బి.పాపారాయ చౌదరి, విజయలక్ష్మీ దంపతులకు 1964లో జన్మించారని,తామరపల్లి,గంగవరంలో ప్రాథమిక, హైస్కూల్ విద్యను పూర్తి చేశారన్నారు.
రాజమండ్రిలోని జీఎస్ కె ఎం లా కాలేజీ నుండి న్యాయవాద శాస్త్ర పట్టా అందుకున్నారన్నారు.1988వ సంవత్సరంలో కాకినాడ బార్ కౌన్సిల్ సభ్యుడిగా,న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారని తెలిపారు.1994లో ఏపీ జ్యుడీషియల్ సర్వీసెస్ లో ఉత్తీర్ణులై జిల్లా మున్సిఫ్ మేజిస్ట్రేట్ గా ఎంపికయ్యారన్నారు.జస్టిస్ చక్రవర్తి జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా వివిధ బాధ్యతలకు సమర్థవంతంగా నిర్వహించారనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు.
మార్చి 2024లో హై కోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం జస్టిస్ చక్రవర్తి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడవాలని కోరుకుంటున్నామని హై కోర్టు ప్రధాన న్యాయమర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. పదవీ విరమణ చేయనున్న జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.తన విద్యార్థి దశ నుండి న్యాయవాదిగా,న్యాయమూర్తిగా ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ప్రతి దశలోనూ ఉత్తమ సలహాలు అందించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు.
అంతకు ముందు అదనపు సోలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్,అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్,ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అద్యక్షులు ప్రభునాథ్ వాసిరెడ్డి లు బీవీఎల్ఎన్ చక్రవర్తికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ జస్టిస్ చక్రవర్తితో తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు,అడిషినల్ అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్,న్యాయవాదులు జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తికి అభినందనలు తెలిపారు. ఇంకా పలువురు రిజిష్ట్రార్లు,బార్ అసోసియేషన్,బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.





