తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ నటుడు విజయ్ భద్రత అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు కల్పిస్తున్న భద్రత సరిపోవడం లేదని ఆరోపిస్తూ ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఫిర్యాదులో చోటుచేసుకున్న ఒక తప్పిదం ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది.
వివరాల్లోకి వెళితే, విజయ్‌కు ప్రస్తుతం ‘Y’ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ, ఎన్నికల ప్రచార సమయంలో క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లు తగిన విధంగా లేవని టీవీకే నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రచార కార్యక్రమాల్లో భద్రతా లోపాలు స్పష్టంగా బయటపడ్డాయని వారు పేర్కొన్నారు.మార్చి 30న పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కొళత్తూర్, విల్లివాక్కం ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే పెరంబూర్, కొళత్తూర్ ప్రాంతాల్లో ప్రసంగాలు ముగిసిన తర్వాత, భారీగా తరలివచ్చిన జనాన్ని నియంత్రించడంలో ఇబ్బందులు తలెత్తడంతో, విల్లివాక్కం పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. పోలీసు బందోబస్తు తగిన స్థాయిలో లేకపోవడమే ఇందుకు కారణమని పార్టీ నేతలు పేర్కొన్నారు.
ఈ ఘటనపై టీవీకే మొదట తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది. అనంతరం పార్టీ కార్యనిర్వాహకుడు సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన లేఖ కాపీతో అసలు వివాదం మొదలైంది.ఆ లేఖలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా అజయ్ కుమార్ భల్లా పేరును ప్రస్తావించారు. అయితే వాస్తవానికి ఆయన ప్రస్తుతం మణిపూర్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి పదవిలో లేరు. ఈ పొరపాటు అధికారిక లేఖలో చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఈ ఘటనపై రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక అధికారిక లేఖలో ఇలాంటి తప్పిదం చోటుచేసుకోవడం పార్టీ విశ్వసనీయతను ప్రశ్నించేలా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, దేశ స్థాయి నాయకులకు పంపే లేఖల్లో ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని వారు సూచిస్తున్నారు.





