విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలను వేగవంతం చేయడంతో తమిళనాడు రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, పూర్తి మెజారిటీ విషయంలో స్పష్టత లేకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విజయ్ రాష్ట్ర గవర్నర్ ఆర్వీ అర్లేకర్ ను మరోసారి కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. బుధవారం జరిగిన తొలి భేటీలో గవర్నర్ పూర్తి మెజారిటీపై సందేహాలు వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం వాయిదా పడిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం టీవీకే కూటమికి కాంగ్రెస్ మద్దతుతో కలిపి 113 స్థానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మెజారిటీకి ఇంకా ఐదు సీట్లు అవసరమవుతున్నాయి. దీంతో చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు విజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.డీఎంకే మిత్రపక్షమైన వీసీకేకు రెండు సీట్లు, వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలకు కలిపి నాలుగు స్థానాలు ఉన్నాయి. ఈ పార్టీలతో టీవీకే నాయకత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వీరి మద్దతు లభిస్తే కూటమి బలం 119కు చేరి, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కును దాటే అవకాశం ఉంది. వామపక్ష పార్టీలు తమ నిర్ణయాన్ని ఈరోజు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు, టీవీకే-ఏఐఏడీఎంకే పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు కూడా తెరపడినట్లు కనిపిస్తోంది. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి విజయ్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో విజయ్ దృష్టి పూర్తిగా చిన్న పార్టీలపై నిలిచింది.ఒకవేళ గవర్నర్ మరోసారి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోతే, న్యాయపరమైన మార్గాలను అనుసరించేందుకు టీవీకే సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.





