సినీ రంగంలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన యువ నటుడు విజయదేవర కొండ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఎంతటి స్టార్‌డమ్ వచ్చినా తన మూలాలను, సొంత గ్రామాన్ని, అక్కడి ప్రజలను మర్చిపోనని నిరూపిస్తూ తన సొంతూరు పరిసర ప్రాంతాల విద్యార్థులకు అండగా నిలిచారు. తన సేవా సంస్థ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్ పరిధిలోని 45 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 180 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. విద్యలో రాణిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా విశేష స్పందన పొందింది.
వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ పాఠశాలల్లో 9వ మరియు 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉపకార వేతనాలు అందించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు చదువులో మరింత ముందుకు సాగేందుకు ఈ సహాయం ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో పాటు ప్రముఖ నటి రష్మిక మందన, ఆయన తల్లి మాధవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశృ కృష్ణా, జిల్లా విద్యాధికారి రమేష్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేసిన అనంతరం విజయ్ వారితో ముచ్చటించి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని సూచించారు.
ఈ కార్యక్రమం వెనుక ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. ఇటీవల తన వివాహం అనంతరం సొంత గ్రామమైన తుమ్మన్‌పేటలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ, తన గ్రామ పరిసర ప్రాంతాల విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తానని ప్రకటించారు. ఆ సందర్భంగా ఇచ్చిన హామీని ఇప్పుడు కార్యరూపంలోకి తీసుకురావడం విశేషం. చాలామంది ప్రముఖులు హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడం అరుదుగా కనిపిస్తుంటే, విజయ్ మాత్రం చెప్పిన మాటను నిలబెట్టుకోవడంతో స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే వంశీకృష్ణ విజయ్ సేవా దృక్పథాన్ని కొనియాడారు. “ఎంత ఎత్తుకు ఎదిగినా తన సొంత గ్రామాన్ని, అక్కడి ప్రజలను మర్చిపోకపోవడం విజయ్ దేవరకొండ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు చేయూతనివ్వడం అభినందనీయం. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ కార్యక్రమం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పడం మరింత సంతోషకరం” అని ఆయన అన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సాహకాలు లభిస్తే వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రేరణ కలుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విజయ్ దేవరకొండకు కృతజ్ఞతలు తెలిపారు.
గత కొన్నేళ్లుగా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా విజయ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, విపత్తు సహాయం వంటి రంగాల్లో పలు కార్యక్రమాలు చేపడుతూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు.





