క్యాటరింగ్ ట్రక్కులో నుంచి విమానంలోకి ట్రంపు.. మా భయమే అంటున్నా ఇరాన్​

Must read

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించి సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. తుర్కియే రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ట్రంప్ సాధారణంగా ప్రయాణించే విమానాన్ని కాకుండా మరో చిన్న సైనిక విమానంలో రహస్యంగా తరలించినట్లు తాజాగా వెల్లడైంది. ఇరాన్ లేదా దాని అనుబంధ సంస్థల నుంచి ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంపై క్షిపణి దాడి జరిగే అవకాశం ఉందన్న విశ్వసనీయ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఈ అసాధారణ భద్రతా చర్య చేపట్టినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.

జూలైలో అంకారాలో జరిగిన నాటో నేతల సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి అమెరికాకు వెళ్లే సమయంలో తొలుత ఆయన కొత్తగా అందిన ఖతార్ బహుమతి విమానంలో ప్రయాణించాల్సి ఉంది. అయితే పరిస్థితులు ఒక్కసారిగా మారడంతో భద్రతా అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా బయటకు వచ్చిన వివరాల ప్రకారం, ట్రంప్‌ను రహస్యంగా చిన్న C-32A సైనిక విమానంలోకి మార్చారు. అదే సమయంలో ఆయన అసలు ప్రయాణించాల్సిన విమానం వేరే మార్గంలో ముందుకు సాగింది.

అమెరికా అధికారులకు అందిన నిఘా సమాచారంలో ట్రంప్ ప్రయాణించే విమానాన్ని లక్ష్యంగా చేసుకుని భుజంపై మోసుకెళ్లే క్షిపణి (shoulder-fired missile)తో దాడి చేసే అవకాశం ఉందన్న హెచ్చరిక ఉన్నట్లు సమాచారం. ఇలాంటి ఆయుధాలను తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలపై ఉపయోగించే అవకాశం ఉండటంతో సీక్రెట్ సర్వీస్ ఈ ముప్పును తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. కొన్ని నివేదికల్లో ఇరాన్‌కు చెందిన లేదా దాని మద్దతు ఉన్న బలగాల నుంచి ముప్పు ఉండొచ్చని పేర్కొన్నారు.

అయితే ఈ ముప్పు గురించి మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఇరాన్ నుంచి ట్రంప్‌పై దాడి చేసే కుట్రకు సంబంధించిన కొన్ని నిఘా హెచ్చరికలను అమెరికా సంస్థలు స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాయని రాయిటర్స్ తాజాగా వెల్లడించింది. సీఐఏ సహా కొన్ని అమెరికా నిఘా సంస్థలు ఈ సమాచారాన్ని తక్కువ విశ్వసనీయతతో అంచనా వేసినట్లు, తుర్కియే నిఘా సంస్థలకు కూడా అంకారా ఘటన సమయంలో ఇందుకు సంబంధించిన ఆధారాలు లభించలేదని నివేదిక పేర్కొంది. అందువల్ల ‘ఇరాన్ తప్పకుండా దాడి చేయబోతోంది’ అని నిర్ధారించడానికి ఆధారాలు లేవని స్పష్టమవుతోంది.

ఈ ఆపరేషన్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ట్రంప్‌ను మరో విమానంలోకి ఎలా తరలించారన్నదే. రిపోర్టుల ప్రకారం, విమానాశ్రయంలోని క్యాటరింగ్ వాహనాన్ని ఉపయోగించి ట్రంప్, కొంతమంది సన్నిహిత సిబ్బందిని రహస్యంగా ప్రత్యామ్నాయ విమానం వద్దకు తీసుకెళ్లారు. దీంతో ట్రంప్ అసలు ఏ విమానంలో ఉన్నారన్న విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే సమయంలో జర్నలిస్టులు, కొంతమంది సిబ్బంది అసలు విమానంలోనే ఉన్నట్లు భావించేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

ట్రంప్ ప్రయాణిస్తున్న విమానమే అని భావించిన విమానాన్ని ఒక రకంగా డీకాయ్‌గా ఉపయోగించినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్ మాత్రం మరో విమానంలో సురక్షితంగా అక్కడి నుంచి బయలుదేరారు. అనంతరం బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ మిల్డెన్‌హాల్ స్థావరంలో తిరిగి ఇతర విమానంతో చేరారు. ఈ మొత్తం వ్యవహారం అత్యంత గోప్యంగా నిర్వహించడంతో ట్రంప్ వెంట ఉన్న జర్నలిస్టులకు కూడా అసలు విషయం వెంటనే తెలియలేదు.

ఈ ఘటనతో ఖతార్ నుంచి అమెరికాకు అందిన కొత్త బోయింగ్ 747-8 విమానం భద్రతా సామర్థ్యాలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. సుమారు 400 మిలియన్ డాలర్ల వ్యయంతో ఈ విమానాన్ని అధ్యక్షుడి ప్రయాణాలకు అనువుగా మార్పులు చేశారు. అయితే పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానాల్లో ఉన్న కొన్ని అధునాతన క్షిపణి గుర్తింపు, ప్రతిఘటన వ్యవస్థలు కొత్త విమానంలో పూర్తిస్థాయిలో లేవన్న విషయంపై ఇప్పటికే చర్చ జరిగింది.

పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానాల్లో incoming missileలను మళ్లించేందుకు ఉపయోగించే లేజర్, ఇతర రక్షణ వ్యవస్థలు ఉన్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో అధ్యక్షుడి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడంతో పాత విమానాన్ని ఉపయోగించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటన బయటకు రావడంతో ఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా దీనిని ట్రంప్‌ను ఎగతాళి చేయడానికి ఉపయోగించుకుంది. ట్రంప్‌కు ఇరాన్ అంటే భయం పట్టుకుందని, అమెరికా అధ్యక్షుడిని రహస్యంగా విమానం మార్చే స్థాయికి పరిస్థితి చేరిందంటూ వ్యంగ్య కథనాలు, మీమ్స్ ప్రచురించింది. ట్రంప్ విమానం మార్చుకున్న విధానాన్ని ‘అవమానం’గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. అయితే ఇది ఇరాన్ ప్రభుత్వ అధికారిక ప్రకటన కంటే అక్కడి ప్రభుత్వ అనుకూల మీడియా ప్రచారంగా చూడాల్సి ఉంటుంది.

విమానం మార్పుపై అప్పట్లో ట్రంప్ భద్రతా కారణాలను బహిరంగంగా అంగీకరించలేదు. తనకు ఇరాన్ నుంచి ఎప్పుడూ ముప్పు ఉంటుందని, తాను ఆ దేశం హిట్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నానని వ్యాఖ్యానించారు. మరోవైపు, తర్వాత వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం సీక్రెట్ సర్వీస్, సైనిక అధికారులు భద్రతా కారణాలతో ప్రయాణ ప్రణాళికను మార్చాలని సూచించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా, అంకారా నుంచి బయలుదేరిన సమయంలో జర్నలిస్టులను విమానం కిటికీల తెరలను మూసివేయాలని కోరడం కూడా అప్పట్లో ఆసక్తి రేపింది. సాధారణంగా అధ్యక్షుడి విదేశీ పర్యటనల్లో ఇలాంటి చర్యలు అత్యంత అరుదుగా కనిపిస్తాయి. తాజా వివరాలు బయటకు రావడంతో ఆ సమయంలో తీసుకున్న జాగ్రత్తల వెనుక భద్రతా కారణాలు ఉన్నాయన్న చర్చ మరింత బలపడింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!