ఆల్ ఇండియా పోలీస్ వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్ విజేతలను అభినందించిన డీజీపీ సి.వి. ఆనంద్

Must read

హర్యానాలోని మధుబన్‌లో ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక 3వ ఆల్ ఇండియా పోలీస్ వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్ (వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్ & యోగా) 2026-27 జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మూడు పతకాలను సాధించారు. మే 23 నుండి 27 వరకు జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ పోలీస్ జట్టు ఒక రజత, రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకొని రాష్ట్ర పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచింది.

జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను డీజీపీ సి.వి. ఆనంద్ డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి కీర్తి తీసుకురావడం గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని క్రీడాకారులను ప్రోత్సహించారు.

మహిళల పవర్‌లిఫ్టింగ్ +84 కేజీల విభాగంలో సీసీఎస్, మల్కాజ్‌గిరి కమిషనరేట్‌కు చెందిన డబ్ల్యూపీసీ ఎస్. రేణుక రజత పతకం సాధించారు. ఆమె మొత్తం 367.5 కిలోల బరువును ఎత్తి ఈ ఘనత సాధించారు. ఇందులో స్క్వాట్‌లో 152.5 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 75 కిలోలు, డెడ్ లిఫ్ట్‌లో 140 కిలోల బరువును ఎత్తారు.పురుషుల పవర్‌లిఫ్టింగ్ 59 కేజీల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం ఓఎస్‌డీకి చెందిన ఏఆర్‌పీసీ ఎమ్. వంశీ కాంస్య పతకం సాధించారు. ఈయన మొత్తం 407.5 కిలోల బరువును ఎత్తి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటారు.

మహిళల ఆర్టిస్టిక్ పెయిర్ యోగా ఈవెంట్‌లో తెలంగాణ మహిళా జట్టు సమిష్టి ప్రతిభతో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ జట్టులో ఈగిల్ ఫోర్స్ హైదరాబాద్‌కు చెందిన డీఎస్పీ టి. లక్ష్మి, భద్రాచలం పోలీస్ స్టేషన్‌కు చెందిన బి. రత్నకుమారి, మహబూబాబాద్ షీ టీమ్స్‌కు చెందిన బి. సౌభాగ్య, రామగుండం కమాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కె. శ్రీలత, ఇల్లందు పోలీస్ స్టేషన్‌కు చెందిన కె. రాణి సభ్యులుగా ఉన్నారు.

ఈ సందర్భంగా క్రీడాకారుల విజయాలకు వెనుక నిలిచిన వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్ కోచ్ రాము, అలాగే ఏఆర్‌ఎస్‌ఐ టి. రమేష్ సేవలను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా మరింత కృషి చేయాలని సూచించారు.

జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్ కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన క్రీడాకారుల విజయంపై రాష్ట్ర పోలీస్ శాఖతో పాటు పలువురు ఉన్నతాధికారులు, సహచరులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐజీపీ (స్పోర్ట్స్) డాక్టర్ గజారావు భూపాల్, స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.వి. రామారావు, పలువురు డీఎస్పీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!