తెలంగాణ రాజకీయాల్లో నీటిపారుదల ప్రాజెక్టులపై మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతునే ఉంది. గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో సరైన దృష్టికోణం లేకపోవడం, ప్రాధాన్యతలు తప్పిపోవడం వల్ల తెలంగాణకు గణనీయమైన నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి, నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం విధానాలను తప్పుబట్టారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు కట్టారు. కానీ అవసరం ఉన్న ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రాజెక్టుల ఎంపికలో సాంకేతిక అధ్యయనం, భౌగోళిక పరిస్థితులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రజల డబ్బు వృథా అయిందని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అప్పగించినప్పుడు తెలంగాణ ఒక ధనిక రాష్ట్రంగా ఉన్నప్పటికీ, పదేళ్లలో భారీగా అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని ఆర్థికంగా బలహీనపరిచారని ఆరోపించారు. సుమారు రూ.8 లక్షల కోట్ల వరకు అప్పులు తీసుకోవడం వెనుక ఉన్న కారణాలను ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ స్థాయి అప్పు తీసుకుని కూడా ప్రాజెక్టులు పూర్తి కాలేదని, అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో జరగలేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ మంత్రి జూపల్లి మరింత ఘాటుగా స్పందించారు.
ఈ ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేశామని గత ప్రభుత్వం చెబుతుండటం పూర్తిగా అబద్ధమని మండిపడ్డారు. ప్రాజెక్టు కాలువలకు ఇప్పటికీ పూర్తి స్థాయి అనుమతులు రాలేదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా పాలమూరు ప్రాజెక్టుపై రాజకీయాలు ఎవరు చేస్తున్నారన్న అంశంపై మంత్రి జూపల్లి ప్రశ్నించారు. “పాలమూరు ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తోంది మీరా? మేమా?” అంటూ బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని నిలదీశారు. ప్రజలకు నిజాలను తెలియనివ్వకుండా, అసత్య ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లాభం పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
పాలమూరు ప్రాంతం దశాబ్దాలుగా నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నదని, ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రాజెక్టులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. అయితే ఆ లక్ష్యాన్ని సాధించడంలో గత ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో భారీగా ఖర్చులు పెట్టినా, ఫలితాలు మాత్రం కనిపించలేదని విమర్శించారు.





