పెరంబూర్‌కే విజయ్‌ మొగ్గు..​

Must read

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి విజయం సాధించిన తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి, విజయ్​ తిరుచ్చి (ఈస్ట్) అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. పెరంబూర్ నియోజకవర్గాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. సినీ రంగంలో ఉన్న విపరీత ప్రజాదరణ రాజకీయాల్లో కూడా స్పష్టంగా కనిపించడంతో, ఆయన రెండు స్థానాల్లోనూ ఘన విజయాన్ని సాధించారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి, రాష్ట్రంలో కొత్త రాజకీయ శకానికి శ్రీకారం చుట్టింది.

ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో గెలిస్తే, వాటిలో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేరకే విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసి, పెరంబూర్‌కు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంతో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెరంబూర్‌ను కొనసాగించడం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉందని చెబుతున్నారు. చెన్నై నగరానికి సమీపంగా ఉన్న ఈ నియోజకవర్గం రాజకీయంగా, పరిపాలనా పరంగా కూడా కీలక ప్రాధాన్యత కలిగి ఉందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలనను సమర్థంగా నిర్వహించేందుకు రాజధాని ప్రాంతానికి సమీపంలోని నియోజకవర్గాన్ని కొనసాగించడం అనుకూలంగా ఉంటుందని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.

దివంగత మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత తర్వాత తమిళనాడులో ఏకకాలంలో రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన నేతగా విజయ్ ప్రత్యేక గుర్తింపు పొందారు. దీంతో ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్రవ్యాప్తంగా మరింత చర్చనీయాంశంగా మారింది. సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా తన ప్రభావాన్ని నిరూపించుకున్నారన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ టీవీకే అధికారంలోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

కొత్తగా ఎన్నికైన 17వ తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశం సోమవారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది. కొత్త ఎమ్మెల్యేలందరూ తమ ఎన్నికల ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలని అసెంబ్లీ కార్యదర్శి సూచించారు. సభ తొలి రోజున కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు. ఇటీవల ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన టీవీకే ఎమ్మెల్యే ఎం.వి. కరుప్పయ్య ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!