స్థానిక యువతకు ఉపాధే ధ్యేయం :మంత్రి శ్రీధర్ బాబు

Must read

రాష్ట్రంలోకి నూతన పరిశ్రమలను, భారీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం మంథని నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. తెలంగాణను పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

పర్యటనలో భాగంగా శివకిరణ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ‘మన ఊరు–మన కోచింగ్ సెంటర్’ ఉచిత కానిస్టేబుల్, ఎస్సై కోచింగ్ సెంటర్‌ను మంత్రి శ్రీధర్ బాబు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాబోయే మూడు నెలల కాలం అభ్యర్థులు తీవ్రమైన క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే పోలీసు ఉద్యోగం సాధించడం సులభమవుతుందని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా కోచింగ్, అవసరమైన పుస్తకాలు, నాణ్యమైన భోజనం మరియు వసతి సౌకర్యాలన్నీ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరారు.

అనంతరం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రతినిధులు, ఇతర స్థానిక పరిశ్రమల యజమానులతో మంత్రి శ్రీధర్ బాబు ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, నీటి సరఫరా, రోడ్డు రవాణా వ్యవస్థ సహా అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం తక్షణమే కల్పిస్తుందని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. పారిశ్రామిక ప్రగతి ద్వారానే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని, ఆ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు.

సామాజిక బాధ్యతలో భాగంగా హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థ ‘ప్రాజెక్ట్ షైన్’ కింద రూ.2 కోట్ల నిధులతో చేపడుతున్న బొక్కలవాగు చెక్‌డ్యామ్ అప్‌గ్రేడేషన్ మరియు సుందరీకరణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద నిధులు కేటాయించి స్థానిక ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్న పరిశ్రమల యాజమాన్యాలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

ఈ చెక్‌డ్యామ్ పరిసర ప్రాంతాల్లో సుందరమైన గార్డెనింగ్, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆడుకోవడానికి ప్రత్యేక పార్కుతో పాటు డీ-సిల్టింగ్ ( పూడికతీత) పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యతా లోపాలు రాకుండా చూసుకోవాలని, నిర్దేశిత కాలపరిమితిలోనే పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.

అనంతరం రత్నాపూర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయతలపెట్టిన కోకాకోలా పరిశ్రమకు కేటాయించిన స్థలాన్ని మంత్రి శ్రీధర్ బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులు, భూసేకరణ మరియు ఇతర సాంకేతిక ప్రక్రియలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశ్రమ రాకతో మంథని పరిసర ప్రాంతాలకు చెందిన స్థానిక యువతకు గరిష్ట సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు.

మంథనిలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి, అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలపై స్థానిక వైద్యాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, మందుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయిస్తానని భరోసా ఇచ్చారు.

చివరగా, మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం మరియు రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులను పరుగులు తీసిస్తామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మంథని సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!