మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ అణచివేస్తోందని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆదివారం నగరంలోని రాయదుర్గం సత్త్వ నాలెడ్జ్ పార్క్‌లో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నోటి క్యాన్సర్ మరాథాన్‌లో పాల్గొన్న ఆయన, 10కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, యువత యోగా, వ్యాయామం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని కోరారు.
చెడు అలవాట్ల వల్ల ప్రాణనష్టాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, సమాజంలో అవగాహన పెంపు అత్యవసరమని తెలిపారు. గుట్కా వంటి హానికర అలవాట్లపై చైతన్య కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలన్నారు.
పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని హెచ్చరించి, వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సైబరాబాద్ సీపీ రమేష్ 5కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. మరో అతిథిగా పాల్గొన్న బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు 2కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నోటి క్యాన్సర్ కారణంగా దేశంలో లక్షలాది మంది మరణిస్తున్నారని తెలిపారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె. దిలీప్ కుమార్ మాట్లాడుతూ నోటి క్యాన్సర్‌పై అవగాహన పెంపు కోసం ఈ మరాథాన్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సాధ్యమవుతుందని, కాబట్టి ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగ దీపిక, డాక్టర్ సౌమ్య, డాక్టర్ వినూత్న, డాక్టర్ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థల ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్లు, ప్రముఖులు, యువతతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రత్యేకంగా పాల్గొన్నారు





