తెలంగాణ రైజింగ్-2047′ మాస్టర్ ప్లాన్‌ :సీఎం రేవంత్​ రెడ్డి

Must read

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక విజన్‌ను ఆవిష్కరించారు. ఆధునీకరణ, పట్టణీకరణ వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం అత్యవసరమని, ఈ క్రమంలోనే ‘తెలంగాణ రైజింగ్-2047’ పేరుతో ఒక బృహత్తర మాస్టర్ ప్లాన్‌ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా రాబోయే రెండు దశాబ్దాల్లో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం వినూత్నమైన మార్పులను శ్రీకారం చుట్టింది. నగరాన్ని ‘ట్రాఫిక్ ఫ్రీ’ మరియు ‘సిగ్నల్ ఫ్రీ’ సిటీగా మార్చేందుకు త్రీ లెవెల్ రవాణా విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా అండర్ పాస్, సర్ఫేస్ (రోడ్డు మార్గం), మరియు ఎలివేటెడ్ కారిడార్లను సమన్వయం చేస్తూ ప్రయాణ సమయాన్ని తగ్గించనున్నారు.

కేవలం రోడ్ల విస్తరణతోనే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదని గుర్తించిన ప్రభుత్వం, మల్టీ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (బహుళ రవాణా వ్యవస్థ)ను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. అంతేకాకుండా, నగరంలో వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు వివిధ ప్రాంతాల్లో అత్యాధునిక మల్టీ లెవెల్ పార్కింగ్ సముదాయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం వివరించారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణను మూడు విభిన్న మండలాలుగా విభజించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిని ‘క్యూర్ , ప్యూర్ , రేర్ ‘ అనే మూడు సూత్రాలతో అభివృద్ధి చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ‘క్యూర్’ ఏరియాను ఐటీ, ఇతర సేవా రంగాలకు (సర్వీస్ సెక్టార్) కేంద్రంగా గుర్తించారు.

ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉండే ‘ప్యూర్’ ఏరియాను ఉత్పత్తి రంగం (మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్) కోసం కేటాయించారు. ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు అవతల ఉండే ‘రేర్’ ఏరియాను పూర్తిస్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల (అగ్రికల్చర్ సెక్టార్) అభివృద్ధికి వినియోగించనున్నారు. ఈ రకమైన వర్గీకరణ వల్ల పరిశ్రమలు, సేవలు మరియు వ్యవసాయం సమతుల్యంగా అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!