ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో సమగ్రశిక్ష అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు.విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా లీప్ యాప్ వినియోగంపై కూడా మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరణను పూర్తిగా ఆటోమేషన్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే వేలాది పాఠశాలల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు అధికారులు వివరించారు. లీప్ యాప్ వినియోగంపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు.
అభ్యసన ఫలితాల మెరుగుదల కోసం సాంకేతికత వినియోగంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. క్లిక్కర్ ఆధారిత పునశ్చరణ విధానం విద్యార్థుల్లో మంచి ఫలితాలు ఇస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులందరికీ ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తర్వాత దశలవారీగా ఇతర తరగతులకు విస్తరించాలని సూచించారు.ఇక విద్యార్థి మిత్ర కిట్ల సరఫరాపై కూడా సమీక్ష జరిగింది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ముడి పదార్థాల కొరత ఏర్పడినా, కిట్ల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఆటిజం సపోర్ట్ సెంటర్ల ఏర్పాటు విషయంలో కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఫేజ్-1 కింద నిర్మాణం పూర్తయిన కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే ఫేజ్-2 కింద మరిన్ని కేంద్రాలను దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కేంద్రాల నిర్వహణలో నిమ్హాన్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల సహకారంతో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.అమరావతిలో నిర్మించనున్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ప్రాజెక్టుపై కూడా మంత్రి సమీక్షించారు. భవన తుది నమూనాను ఆమోదించి, పనులను వేగంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొత్తంగా, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కీలక సంస్కరణలను అమలు చేస్తోందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.





