తెలంగాణలో ప్రభుత్వ భూముల కబ్జాపై మరో వివాదం తెరపైకి వచ్చింది. పటాన్చెరు ప్రాంతంలో జాతీయ రహదారి విస్తరణ ముసుగులో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పటాన్చెరు డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాత భవనం స్థలాన్ని ఎంపీ పరిశీలించారు. అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
విలేకర్ల సమావేశంలో శ్రీనగర్ కాలనీ సమీపంలో 1962లో జిల్లా పరిషత్ అధికారులు ఈ పాఠశాల భవనాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. దశాబ్దాల పాటు వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఈ పాఠశాల తరువాత కాలంలో వసతుల కొరత కారణంగా కొత్త భవనానికి మార్చినట్లు వివరించారు. అప్పటి నుండి పాత భవనం అలాగే ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ విలువైన భూమిపై కొందరు కబ్జాదారులు కన్నేశారని, వందల కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని తమ తాతల ఆస్తిగా చూపిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వేసినట్లు ఎంపీ ఆరోపించారు. అయితే న్యాయస్థానాలు కబ్జాదారుల వాదనలను తిరస్కరించడంతో పాటు, స్టే ఆర్డర్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
మంగళవారం రాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జాతీయ రహదారి విస్తరణ పేరుతో పాఠశాల పాత భవనాన్ని పూర్తిగా కూల్చివేసినట్లు ఎంపీ వెల్లడించారు. ఈ చర్య పూర్తిగా చట్టవిరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానిక బీజేపీ నాయకుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే, జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు రఘునందన్ రావు తెలిపారు. అధికారులు రంగంలోకి దిగిన వెంటనే కబ్జాదారులు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని, ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత అధికారులపై ఉందని ఎంపీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా విద్యాసంస్థల భూములను రక్షించడం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ అంశంలో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి క్షేత్రస్థాయి పర్యటన చేయడంతో పాటు కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల నిరసనను. పౌర ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.





