నర్మదా నదిలో క్రూయిజ్ బోటు మునిగి ఏడుగురు మృతి

Must read

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నర్మదా నదిలో జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జబల్‌పూర్ సమీపంలోని బర్గీ డ్యాం వద్ద పర్యాటకులతో వెళ్తున్న ఒక క్రూయిజ్ బోటు మునిగిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో, ఆనందంగా సాగాల్సిన విహారయాత్ర ఒక్కసారిగా పెను విషాదంగా మారింది. మధ్యప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన ఈ క్రూయిజ్ బోటులో ప్రమాద సమయంలో మొత్తం 29 మంది పర్యాటకులు ఉన్నారు. వారు జబల్‌పూర్‌లోని ఖమారియా ద్వీపం సమీప ప్రాంతాలను సందర్శిస్తూన్నారు.

బోటు ఖమారియా ద్వీపం సమీపానికి చేరుకునే సమయంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బలమైన గాలులతో కూడిన తుఫాను రావడంతో బోటు అదుపుతప్పి నీటిలో మునిగిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం చాలా వేగంగా చోటుచేసుకోవడంతో పర్యాటకులు తేరుకునేలోపే పరిస్థితి విషమించింది.

ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది పర్యాటకులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు నీటిలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఇప్పటివరకు 15 మంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. మిగిలినవారిలో కొందరు నీటిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే SDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు ఇద్దరు మహిళలతో సహా ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. మరో 8 మంది ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

బోటు కెప్టెన్ లైఫ్ జాకెట్ ధరించి ఉండటంతో అతను ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. చీకటి పడిన తర్వాత కూడా సెర్చ్‌లైట్ల సహాయంతో రాత్రంతా గాలింపు కొనసాగించారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర రక్షణ బృందాలు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. ముఖ్యంగా వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ బోటు ప్రయాణం ఎందుకు కొనసాగించారన్న అంశంపై విచారణ జరగనుంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!