భారత ప్రజాస్వామ్య చరిత్రలో బుధవారం ఒక చారిత్రక ఘట్టం నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో అత్యధిక కాలం వరుసగా ఎన్నికైన ప్రధానిగా నిలిచి కొత్త రికార్డు సృష్టించారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ మోదీ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు.
2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన మోదీ, నేటితో వరుసగా 4,399 రోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. దీంతో నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డు వెనక్కి వెళ్లిపోయింది. భారత రాజకీయ చరిత్రలో ప్రజల తీర్పుతో వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చి ఇంతకాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా మోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
స్వాతంత్ర్యం అనంతరం జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత 1952 మే 13న ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన జవహర్‌లాల్ నెహ్రూ, 1964 మే 27న మరణించే వరకు దేశాన్ని నడిపించారు. ఎన్నికైన ప్రధానిగా ఆయన వరుస పాలన 4,398 రోజుల పాటు కొనసాగింది. అయితే 2026 జూన్ 10తో మోదీ ఆ రికార్డును అధిగమించి 4,399 రోజుల మైలురాయిని చేరుకున్నారు. ఈ జాబితాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 4,077 రోజుల పదవీకాలంతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మోదీ సాధించిన ఈ ఘనత కేవలం కాల పరిమితి రికార్డు మాత్రమే కాదు. వరుసగా మూడు సాధారణ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం, దీర్ఘకాలం నాయకత్వాన్ని కొనసాగించడం వంటి అంశాలకు ఇది ప్రతీకగా నిలుస్తోంది.
ఈ చారిత్రక సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రధాని మోదీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆయన నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి ఈ సుదీర్ఘ పాలన నిదర్శనమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సమగ్ర పురోగతిలో మోదీ పాత్రను ప్రశంసించిన రాష్ట్రపతి, ఆయన నాయకత్వంలో భారత్ అనేక రంగాల్లో వేగంగా ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతులు, డిజిటల్ పరివర్తన, సామాజిక సంక్షేమ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశానికి కొత్త దిశను చూపించాయని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ముర్ము ప్రత్యేకంగా ఆదివాసీ సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం-జన్మన్’, ‘ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ వంటి పథకాలు తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్నాయని తెలిపారు. దేశంలోని అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల అభివృద్ధి కోసం చేపట్టిన ఈ కార్యక్రమాలు సామాజిక న్యాయం దిశగా కీలక అడుగులని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు.





