కాజీపేట రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు లేఖ రాశారు. ఈ లేఖను బీఆర్ఎస్ ఎంపీల బృందం ఢిల్లీలో కేంద్రమంత్రికి స్వయంగా అందజేసింది. ఈ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు బీఆర్ఎస్ ఎంపీలు వెల్లడించారు.కేటీఆర్ తన లేఖలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే డివిజన్పై పెరుగుతున్న పనిభారం గురించి వివరించారు. ప్రస్తుతం ఈ డివిజన్ పరిధిలోని ట్రాక్ పొడవు సుమారు 2,755 కిలోమీటర్లుగా ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వాడి-రాయచూర్, విష్ణుపురం-బీబీనగర్ డబ్లింగ్ పనులు పూర్తైతే ఈ ట్రాక్ పొడవు 3,150 కిలోమీటర్లకు చేరుకుంటుందని తెలిపారు.
భారతీయ రైల్వేల పరిపాలనా ప్రమాణాల ప్రకారం ఒక రైల్వే డివిజన్‌కు ఉండాల్సిన ట్రాక్ పరిమితి కంటే ఇది చాలా ఎక్కువగా ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. అధిక పనిభారం కారణంగా సికింద్రాబాద్ డివిజన్ నిర్వహణ క్లిష్టంగా మారుతోందని, ఇది రైళ్ల రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు.
ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాజీపేట భౌగోళికంగా, రైల్వే కార్యకలాపాల పరంగా కీలక స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇక్కడ డివిజన్ ఏర్పాటు చేస్తే పరిపాలనా సౌలభ్యం పెరిగి, రైల్వే సేవలు మరింత మెరుగుపడతాయని వివరించారు.
కాజీపేట డివిజన్ ఏర్పాటుతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడమే కాకుండా, సరుకు రవాణా వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ప్రాంతీయ అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడుతూ, తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కాజీపేట డివిజన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.





