జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ రాజకీయంగా కీలక మలుపు తీసుకుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ సభలో రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తూ, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ముఖ్యంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది. జీవన్ రెడ్డి చేరికతో పార్టీకి బలమైన నాయకత్వం లభిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన ధైర్యం, నిబద్ధతను ప్రశంసిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
సభాముఖంగా కేసీఆర్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పని తరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యుత్ సమస్య, ధాన్యం కొనుగోలు లోపాలు, ఎరువుల కొరత వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ఉద్యోగులకు పీఆర్సీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు వాగ్దానం చేసిన ఆర్థిక సాయం, పింఛన్ల పెంపు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. “హైడ్రా” పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆరోపిస్తూ మేము అధికారంలోకి రాగానే ఆ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు.
రాష్ట్ర ఆవిర్భావం ముందు ఉన్న పరిస్థితులను గుర్తుచేస్తూ కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. అప్పట్లో ఎక్కడ చూసినా కరువు, వలసలు, రైతుల ఆత్మహత్యలు కనిపించేవని, రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, 24 గంటల విద్యుత్ వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపామని వివరించారు.
నేడు రైతులకు మద్దతు లేకపోవడం, రియల్ ఎస్టేట్ రంగం మందగించడం, చేనేత కార్మికుల సమస్యలు పెరగడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. పల్లె ప్రగతి, మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారిందని విమర్శించారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతు కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎదుర్కొన్నానని, రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్లో చేరుతున్నానని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని ఆయన అన్నారు. గతంలో కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని గుర్తు చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.





