కేసీఆర్ జోక్యంతో సాగునీటి విడుదల

Must read

తెలంగాణలో సాగునీటి పంపిణీ విషయంలో మరోసారి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జోక్యం రైతులకు ఊరట కలిగించింది. సిద్దిపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయనే సమాచారంపై ఆయన తక్షణమే స్పందించారు. కొండపోచమ్మ సాగర్‌ జలాశయం నుంచి కాలువల ద్వారా నీటి విడుదలకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశమైంది.

గత కొంతకాలంగా కొండపోచమ్మ సాగర్‌ నుంచి సంగారెడ్డి, ఆలేరు కాలువల ద్వారా సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తూ ఉన్నప్పటికీ, సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొన్ని గ్రామాలకు మాత్రం నీరు అందకపోవడం రైతులను ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా కొట్యాల, అల్లీనగర్, అడవి మజీద్, క్షీరసాగర్, జప్తి సింగాయపల్లి గ్రామాల పరిధిలోని కాలువలకు నీటి సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను ఉమ్మడి మెదక్‌ జిల్లా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ డైరెక్టర్ అంజిరెడ్డి దృష్టికి రైతులు తీసుకువెళ్లారు. పంటల పరిస్థితి దారుణంగా ఉందని, తక్షణమే నీరు అందించకపోతే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయనకు వివరించారు. రైతుల సమస్యను అత్యవసరంగా పరిగణించిన అంజిరెడ్డి, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ను కలిసి విషయాన్ని వివరించారు.

రైతుల ఇబ్బందులను విన్న కేసీఆర్ వెంటనే స్పందించారు. ఆలస్యం చేయకుండా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. సంబంధిత ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి తెలిపారు. వెంటనే చర్యలు తీసుకుని కాలువల్లోకి నీటిని విడుదల చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. కొండపోచమ్మ సాగర్‌ నుంచి సంబంధిత కాలువల ద్వారా నీటి విడుదల ప్రారంభించారు. దీంతో కొట్యాల నుంచి జప్తి సింగాయపల్లి వరకు ఉన్న గ్రామాల పరిధిలో కాలువల్లో నీరు ప్రవహించడం ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత నీరు చేరడంతో రైతుల్లో ఆనందం నెలకొంది.

నీటి విడుదల అనంతరం కాలువల్లో ప్రవహిస్తున్న నీటిని అంజిరెడ్డి, సంబంధిత అధికారులు కలిసి పరిశీలించారు. నీటి ప్రవాహం సక్రమంగా సాగుతోందో లేదో పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా రైతులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు. పంటలకు తగినంత నీరు అందుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!