తెలంగాణలో అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టులలో ఒకటైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తిరిగి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో బ్యారేజీల పునరుద్ధరణ పనులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది.
ముఖ్యంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన నిర్మాణ లోపాల నేపథ్యంలో, మరమ్మతుల పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది.ఈ క్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కర్నల్ పరీక్షిత్ మెహ్రా నాయకత్వంలో ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కమిటీ పనుల పురోగతిని దగ్గరగా పరిశీలిస్తూ, అవసరమైన సూచనలు ఇవ్వనుంది.సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. స్టీరింగ్ కమిటీ వారానికి కనీసం రెండు సార్లు సమావేశమై పనుల పురోగతిని అంచనా వేయాలని తెలిపారు. అవసరమైతే తాను కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటానని చెప్పారు. రోజువారీ పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని కూడా సూచించారు.
ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీని కనీసం కొంత భాగం అయినా త్వరగా వినియోగంలోకి తేవాలని మంత్రి ఆదేశించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు నిర్ణీత గడువులో పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పునరుద్ధరణలో సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ సంస్థలు గుర్తించిన లోపాలపై మంత్రి తీవ్రంగా స్పందించారు.
బ్యారేజీల నిర్మాణంలో ఫౌండేషన్, డిజైన్, అమలు వంటి అంశాల్లో లోపాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల పునరుద్ధరణ పనుల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 2027, 2028 సంవత్సరాలను కీలకంగా తీసుకుని పనులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.





