మహిళా క్రికెట్ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రానున్న మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌కు మొత్తం రూ.81 కోట్ల (87,64,615 డాలర్లు) నగదు బహుమతిని కేటాయించడం విశేషం. మహిళా క్రికెట్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాతని ఇది స్పష్టంగా చూపిస్తోంది.
2026 జూన్-జూలైలో ఇంగ్లాండ్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈసారి మొత్తం 12 జట్లు పోటీలో పాల్గొననున్నాయి. గత టోర్నమెంట్‌తో పోలిస్తే ఈసారి రెండు జట్లు అదనంగా పాల్గొనడం విశేషం. దీంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది.
2024లో యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్‌లో రూ.70 కోట్ల (79,58,077 డాలర్లు) ప్రైజ్ మనీని ప్రకటించారు. ఆ టోర్నమెంట్లో మొత్తం 10 జట్లు పాల్గొన్నాయి. అయితే రాబోయే 2026 ఎడిషన్‌లో ప్రైజ్ ఫండ్‌ను 10 శాతం పెంచడం ద్వారా ఐసీసీ మహిళా క్రికెట్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టమవుతోంది.
ప్రైజ్ మనీ పెంపు కేవలం ఆర్థిక ప్రోత్సాహం మాత్రమే కాకుండా, మహిళా క్రికెటర్లకు మరింత గుర్తింపు, గౌరవం కల్పించే చర్యగా కూడా భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళా క్రీడలకు ప్రోత్సాహం పెరుగుతున్న నేపథ్యంలో ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది.
గత టోర్నమెంట్లో న్యూజిలాండ్ జట్టు విజేతగా నిలిచింది. ఆ జట్టు అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈసారి కూడా పలు బలమైన జట్లు పోటీలో పాల్గొననున్న నేపథ్యంలో ఆసక్తికర పోటీలు జరగనున్నాయి.
ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ టోర్నమెంట్‌కు ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు పాల్గొననున్న ఈ పోటీలను అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టేడియాల్లో ప్రేక్షకుల హాజరు కూడా పెరిగే అవకాశం ఉంది.





