హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి మంచి వార్త అందింది. రిజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్(ఆర్పీవో) ఆధ్వర్యంలో, వేసవి కాలంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా అపాయింట్‌మెంట్ల కోసం ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు వినూత్నంగా “పాస్‌పోర్ట్ మేళా” నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేళా మే 9న జరగనుంది.
ప్రస్తుతం పాస్‌పోర్ట్ అప్లికేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విదేశీ విద్య, ఉద్యోగాలు, పర్యటనలు వంటి కారణాలతో యువత, ఉద్యోగార్థులు ఎక్కువగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. దీంతో అపాయింట్‌మెంట్ కోసం 8 నుంచి 10 రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆర్పీవో అధికారులు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు.
ఈ నేపథ్యంలో మే 9న నిర్వహించే పాస్‌పోర్ట్ మేళాలో భాగంగా, నార్మల్ కేటగిరీ కింద 4,000 అదనపు అపాయింట్‌మెంట్ స్లాట్లను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆర్పీవో అధికారి జే. స్నేహజ వెల్లడించారు. ఈ చర్యతో అపాయింట్‌మెంట్ కోసం వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు.
హైదరాబాద్ నగర పరిధిలోని ప్రధాన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు ఈ అదనపు స్లాట్లు కేటాయించారు. ముఖ్యంగా బేగం పేట్, ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్, రాయదుర్గ, ప్రాంతాల్లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు కలిపి 3,100 స్లాట్లు కేటాయించారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్ కేంద్రాలకు 900 స్లాట్లు అందుబాటులో ఉంచారు.
అయితే ఈ ప్రత్యేక స్లాట్లు తత్కాల్ సేవలకు లేదా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) కోసం వర్తించవని అధికారులు స్పష్టం చేశారు. ఇవి కేవలం నార్మల్ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఈ పాస్‌పోర్ట్ మేళా ప్రధాన లక్ష్యం అపాయింట్‌మెంట్ నిరీక్షణ కాలాన్ని తగ్గించడం. ప్రస్తుతం 8 నుంచి 10 రోజులుగా ఉన్న నిరీక్షణను 5 నుంచి 7 రోజులకు తగ్గించడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. దీనివల్ల దరఖాస్తుదారులు వేగంగా సేవలు పొందే అవకాశం ఉంటుంది.
పాస్‌పోర్ట్ సేవలను మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు తీసుకుంటున్న ఈ చర్యలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మేళాలను నిర్వహించే అవకాశం ఉందని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు.
పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముందస్తుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని, అవసరమైన పత్రాలతో సమయానికి కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు.





