హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ ధృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రజారవాణాను మరింతగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో, ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రతిపాదనపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోంది.
ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, జూన్ 2 నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆఫీస్ టైమింగ్స్‌లో రోడ్లపై భారీగా వాహనాలు కదలాడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత వాహనాలకు బదులు ప్రజారవాణా వాడేలా ప్రోత్సహించడం ద్వారా ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రతిపాదన అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు సహా ఇతర ఉన్నతాధికారులు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పథకం అమలు విధానం, ఆర్థిక భారం, నిర్వహణ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.
ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవల ద్వారా రైల్వే శాఖకు ఏటా సుమారు రూ.10 కోట్ల ఆదాయం వస్తోంది. ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లోకి వస్తే ఈ ఆదాయం కోల్పోతుందని భావించిన ప్రభుత్వం, ఆ మొత్తాన్ని తామే భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అధికారిక లేఖ రాశారు.
ప్రభుత్వం ఈ పథకాన్ని తొలుత ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని యోచిస్తోంది. ఈ కాలంలో ప్రయాణికుల స్పందన, ట్రాఫిక్ తగ్గుదల, కాలుష్య నియంత్రణ వంటి అంశాలను సమీక్షించి, భవిష్యత్తులో కొనసాగించాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ పథకం విజయవంతం కావాలంటే ఎంఎంటీఎస్ సేవలను మరింత విస్తరించడం, రైళ్ల సంఖ్య పెంచడం, సమయపాలన మెరుగుపరచడం వంటి చర్యలు కూడా అవసరమన్న దిశలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉచిత ప్రయాణం వల్ల రద్దీ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని కొందరూ హెచ్చరిస్తున్నారు.





