కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్..

Must read

మహానగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీకి చెక్ పెడుతూ, నగర రవాణా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటి) ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా, నగరంలోని అత్యంత కీలకమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 ప్రధాన జంక్షన్లలో రూ. 1,090 కోట్ల అంచనా వ్యయంతో 7 మల్టీ-లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్లు, 7 డైరెక్షనల్ అండర్‌పాస్‌లు మొత్తం 14 నిర్మాణాల బృహత్తర నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ నిర్మాణ పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా శరవేగంగా పూర్తి చేసి, త్వరితగతిన ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నెల 18వ తేదీ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ వన్-వే అమలుపై నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, నిర్మాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమగ్ర అధ్యయనం, రెండు విడతల ట్రయల్ రన్స్ అనంతరం జీహెచ్ఎంసీ సహకారంతో క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కేబీఆర్ పరిసర కాలనీవాసులు, వాకర్స్, సంక్షేమ సంఘాల ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ.. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ప్రణాళికల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నామన్నారు. కేబీఆర్ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చేపట్టిన ఈ కీలక ప్రాజెక్టుకు నగరవాసులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కోర్ సిటీని ఐటీ సాఫ్ట్‌వేర్ హబ్‌తో అనుసంధానించే కేబీఆర్ పార్క్ కారిడార్ నగరంలోనే అత్యంత రద్దీగల కీలక రవాణా మార్గం. ఉదయం, సాయంత్రం వేళల్లో పీక్ అవర్స్‌లో ఈ మార్గంలో ఉండే వాహనాల రాకపోకల ఒత్తిడిని శాస్త్రీయంగా అంచనా వేసేందుకు ప్యాసింజర్ కార్ యూనిట్స్ పర్ అవర్ (PCU/Hr) ప్రాతిపదికన సేకరించిన డేటా.. ఇక్కడి రద్దీ తీవ్రతను స్పష్టం చేస్తోంది.

ఈ గణాంకాల ప్రకారం.. ప్రాజెక్టు పరిధిలోని 6 ప్రధాన జంక్షన్లలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ గంటకు 15,321 ప్యాసింజర్ కార్ యూనిట్ల (PCU) రద్దీతో మొదటి స్థానంలో నిలవగా, కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్ గంటకు 13,516 PCUల రాకపోకలతో తర్వాతి స్థానంలో ఉంది. ఈ రెండు జంక్షన్లు నిత్యం కిక్కిరిసిపోతూ ప్రధాన బాటిల్‌నెక్‌లుగా మారాయి. ఇక మహారాజా అగ్రసేన్ జంక్షన్ (10,356 PCU), రోడ్ నంబర్ 45 జంక్షన్ (9,966 PCU), ఫిలింనగర్ జంక్షన్ (9,605 PCU) ల వద్ద ప్రతి గంటకూ దాదాపు 10 వేల కార్ల సామర్థ్యంతో సమానమైన వాహనాల ప్రవాహం నమోదవుతుండగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద గంటకు 5,880 PCUల వాహన రద్దీ ఉంటోంది.

పీక్ అవర్స్‌లో గంటకు 10 వేల నుండి 15 వేలకు పైగా వాహనాలు దాటే ఈ మార్గంలో సాధారణ సిగ్నల్ విధానం ద్వారా ట్రాఫిక్‌ను నియంత్రించడం అసాధ్యం. సిగ్నల్స్ వద్ద నిత్యం వాహనాలు నిలిచిపోతుండటంతో కేబీఆర్ పార్క్ చుట్టూ తీవ్రమైన రద్దీ ఏర్పడుతోంది. ఈ నగర రవాణా చిక్కుముళ్లను మూలాల నుంచి నిర్మూలించి, ప్రయాణాన్ని సుగమం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘హెచ్-సిటీ’ ప్రాజెక్టును పట్టాలెక్కించింది.

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. ” మల్టీ-లెవెల్ నిర్మాణాలు పూర్తయితే కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్, రోడ్ నం. 45, ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల వద్ద 100% ట్రాఫిక్ సమస్య పరిష్కారమై సిగ్నల్ రహిత రాకపోకలు సాగుతాయి. అత్యంత రద్దీ ఉండే జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద 80% మేర ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి. ఫలితంగా కోర్ సిటీ-ఐటీ కారిడార్ మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కోట్లాది రూపాయల విలువైన ఇంధనం ఆదా అవుతుంది.

అంతేకాకుండా జంక్షన్ల వద్ద నిలిచిపోయే వాహనాలు తగ్గడం వల్ల కేబీఆర్ పార్క్ చుట్టూ కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గి పర్యావరణం పరిరక్షించబడుతుంది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే వన్-వే విధానం వల్ల తొలి రోజుల్లో వాహనదారులకు రూట్ మారడం వల్ల కొంత ఇబ్బంది ఎదురుకావచ్చు. కానీ పనులను నిర్ణీత వ్యవధిలో శరవేగంగా పూర్తి చేసి, భవిష్యత్తు తరాలకు సుఖమయమైన ప్రయాణాన్ని అందించడానికే ఈ ఏర్పాటు చేశాం. భవిష్యత్ ప్రయోజనాల కోసమే తాత్కాలిక వన్-వే. ప్రాజెక్టు నిర్మాణానికి వాహనదారులు, స్థానిక నివాసితులు, నగర ప్రజలందరూ పోలీస్ శాఖకు సంపూర్ణంగా సహకరించాలి” అని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!