ప్రతి ఏడాది వేలాది మంది భక్తులను ఆకర్షించే ప్రముఖ ‘చేప ప్రసాదం’ పంపిణీ కార్యక్రమానికి హైదరాబాద్ నగరం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ V. C. సజ్జనర్ వెలడించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే వేలాది మంది భక్తులు హైదరాబాద్‌కు చేరుకోవడంతో నాంపల్లి పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భద్రత, ట్రాఫిక్, వైద్య సేవలు, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు, అలాగే ఈ ప్రసాదంపై విశ్వాసం కలిగిన భక్తులు ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈసారి కూడా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 25 వేల మంది భక్తులు ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తున్నట్లు సమాచారం. రాత్రి నుంచి ప్రారంభమయ్యే పంపిణీ కార్యక్రమం కోసం నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, లాడ్జిలు, ధర్మశాలలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
కార్యక్రమం సజావుగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంత్రులు
పొన్నం ప్రభాకర్, వాకిటి సరిత, మహ్మద్ అజారుద్దీన్,నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు, తాగునీటి సదుపాయాలు, విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు, అత్యవసర సేవలపై వారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమానికి భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు వెయ్యి మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ భద్రతా ఏర్పాట్లను గోల్కొండ డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షిస్తారని వెల్లడించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు సురక్షితంగా కార్యక్రమంలో పాల్గొనేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
నాంపల్లి ప్రాంతంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో పలు రహదారులపై ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నగర ప్రజలు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు అదనపు ట్రాఫిక్ సిబ్బందిని కూడా మోహరించారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకునే భక్తులకు మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేశారు.
భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఐదు అంబులెన్సులను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. వైద్య బృందాలు 24 గంటల పాటు అందుబాటులో ఉండనున్నాయి. ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రాథమిక చికిత్స నుంచి అత్యవసర సేవల వరకు అందించేలా చర్యలు తీసుకున్నారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.





