ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి :మంత్రి హరీశ్ రావు

Must read

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, పట్టుదలతో ముందుకు సాగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. చదువు పూర్తయ్యాక కేవలం ఉద్యోగాలు అడిగే స్థాయిలో కాకుండా, తమ నైపుణ్యాలతో పదిమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. కేఆర్ ఉచిత ఇంజనీరింగ్, కెరీర్ గైడెన్స్ ఆధ్వర్యంలో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలలో సీట్లు సాధించిన విద్యార్థులకు సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్ రావు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీలలో సీట్లు సాధించడం సాధారణ విషయం కాదన్నారు.

ప్రతిష్టాత్మక సంస్థలో లభించిన ఒక్క సీటుతో విద్యార్థి భవిష్యత్తుతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా మారే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును మార్చాలనే ఉద్దేశంతో ‘కేఆర్ గైడెన్స్ సెల్’ ఏర్పాటు చేసి ఉచితంగా మార్గనిర్దేశం చేస్తున్న కొలుపుల రాములు సేవలను హరీశ్ రావు అభినందించారు. ఉపాధ్యాయుడిగా తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ సొంత పిల్లలుగా భావించి వాట్సాప్ ఛానళ్లు, కౌన్సెలింగ్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ సీట్లు కేవలం హైదరాబాద్‌లోని కార్పొరేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే వస్తాయనే అపోహను గ్రామీణ ప్రాంత విద్యార్థులు చెరిపివేశారని అన్నారు. పట్టుదల, ఏకాగ్రత ఉంటే గ్రామీణ విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో అద్భుతాలు సాధించగలరని ఈ విద్యార్థులు నిరూపించారని కొనియాడారు. కొలుపుల రాములు కృషితో ఇప్పటికే సుమారు 3 వేల మంది విద్యార్థులు అత్యుత్తమ కళాశాలల్లో సీట్లు పొందడం గొప్ప మార్పుకు సంకేతమని హరీశ్ రావు అన్నారు.

ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో విద్య పూర్తిచేసిన వెంటనే ప్రైవేటు ఉద్యోగాల్లో చేరిపోవడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకుండా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, డిఫెన్స్ తదితర ఆల్ ఇండియా సర్వీసుల వైపు కూడా విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు. జాతీయ స్థాయిలో మన ప్రాంతానికి చెందిన అధికారుల ప్రాతినిధ్యం మరింత పెరగాలని, మన బిడ్డలు సివిల్ సర్వెంట్లుగా దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ, సరైన మార్గదర్శకత్వం, సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల అనేక మంది తమ సామర్థ్యానికి తగిన అవకాశాలను అందుకోలేకపోతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా మార్గదర్శకత్వం అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ‘కేఆర్ గైడెన్స్ సెల్’ ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తున్న కొలుపుల రాములు సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఉపాధ్యాయుడిగా తన వృత్తిపరమైన బాధ్యతలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ వేలాది మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడం గొప్ప విషయమని హరీశ్ రావు అన్నారు. విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి వారికి అవసరమైన సమాచారాన్ని అందించడం, కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించడం, వాట్సాప్ ఛానళ్ల ద్వారా నిరంతరం సమాచారం చేరవేయడం, అవసరమైన వారికి కౌన్సెలింగ్ అందించడం వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ యుగంలో ప్రపంచం మొత్తం యువత చేతుల్లోనే ఉందని హరీశ్ రావు అన్నారు. వినూత్న ఆలోచనలతో స్టార్టప్‌లను స్థాపించి యువత గూగుల్, అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. మన విద్యార్థులు కూడా కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు ఎప్పుడూ ‘థింక్ బిగ్’ అనే సూత్రాన్ని నమ్మాలని, లక్ష్య సాధనలో ఒకటి రెండు సార్లు విఫలమైనా నిరాశ చెందకుండా పట్టువిడవకుండా శ్రమించాలని హరీశ్ రావు సూచించారు. ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించి తమ ప్రతిభను ఇప్పటికే నిరూపించుకున్న విద్యార్థులు భవిష్యత్తులోనూ అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షించారు. తమ తల్లిదండ్రులకు, సిద్దిపేటకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!