మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 తెలుగు ట్రైలర్ విడుదలై సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన థ్రిల్లర్ ఫ్రాంచైజ్‌గా గుర్తింపు పొందిన ‘దృశ్యం’ సిరీస్‌కు ఇది మూడో భాగం. సోమవారం విడుదలైన ట్రైలర్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో చాలా కాలంగా ఉన్న ఒక ప్రధాన సందేహానికి కూడా తెరపడింది.
గత రెండు భాగాల మాదిరిగా ఈసారి తెలుగు హీరో వెంకటేత్ తో రీమేక్ రూపొందించడం లేదని, అసలు మలయాళ వెర్షన్‌నే తెలుగులో డబ్ చేసి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. దీంతో అభిమానుల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మోహన్‌లాల్ ఒరిజినల్ వెర్షన్‌ను నేరుగా చూసే అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు వెంకటేష్ రీమేక్ లేకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
మే 21న మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దర్శకుడు జీతూజోసేఫ్ ఈ సినిమా కథలో కొత్త కోణాన్ని చూపించబోతున్నట్లు తెలిపారు. గత రెండు భాగాల్లో జార్జ్‌కుట్టికి తనను ఎవరు వెంబడిస్తున్నారో స్పష్టంగా తెలుసు. పోలీసుల నుంచి, చట్టం నుంచి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలనే పోరాటమే ప్రధానంగా కనిపించింది.
అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. “జార్జ్‌కుట్టిని వెంటాడుతున్నది ఎవరు? అసలు శత్రువు ఎక్కడ ఉన్నాడు? అనే విషయం అతనికే తెలియదు. తెలియని భయం అతన్ని మానసికంగా వెంటాడుతుంది. అదే ఈ చిత్రానికి ప్రధాన బలం” అని జీతూ జోసెఫ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో సినిమా కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ట్రైలర్‌లో కనిపించిన డార్క్ విజువల్స్, టెన్షన్‌భరిత సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
మోహన్‌లాల్ పోషించిన జార్జ్‌కుట్టి పాత్ర ఇప్పటికే భారతీయ సినీ చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటిగా నిలిచింది. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అతను వేసిన ఎత్తుగడలు ప్రేక్షకులను మొదటి భాగంలో సాధారణ కేబుల్ ఆపరేటర్‌గా కనిపించిన జార్జ్‌కుట్టి, రెండో భాగంలో మరింత తెలివిగా వ్యవహరించాడు. ఇప్పుడు మూడో భాగంలో అతను ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, తెలియని ప్రమాదం కథను కొత్తస్థాయికి తీసుకెళ్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగులో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలను వెంకటేష్ రీమేక్ చేసి మంచి విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ ప్రేక్షకుల్లో ఆ సినిమాలకు మంచి ఆదరణ లభించింది. దీంతో మూడో భాగాన్ని కూడా వెంకటేష్‌తోనే తెరకెక్కిస్తారని చాలామంది భావించారు.
ప్రస్తుతం ‘దృశ్యం 3’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ అభిమానులు ఈ చిత్రాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత రెండు భాగాలు సాధించిన విజయాల కారణంగా మూడో భాగంపై కూడా భారీ హైప్ ఏర్పడింది. తెలియని శత్రువు, మానసిక భయం, కుటుంబ రక్షణ కోసం మరోసారి జార్జ్‌కుట్టి చేసే పోరాటం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.





