ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక సమస్యలను మాధవ్ సీఎం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఈ భేటీలో ప్రధానంగా తీరప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృత చర్చ జరిగింది. నెల్లూరు
ఒంగోలు, బాపట్ల జిల్లాల తీరప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మాధవ్ వివరించారు. ఈ ప్రాంతాల్లో జీవనోపాధి పూర్తిగా సముద్రంపై ఆధారపడినందున, చిన్న సమస్య కూడా వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆయన విన్నవించారు.
తమిళనాడుకు చెందిన మత్స్యకారులు స్పీడ్ బోట్లను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అక్రమ ప్రవేశం వల్ల స్థానిక మత్స్యకారులకు నష్టం జరుగుతోందని, సముద్రంలో లభించే మత్స్య సంపదను తమిళనాడు వారుఅధికంగా వినియోగించడంతో స్థానికులకు వనరులు తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు.
ఇది ఆర్థిక సమస్యగా కాకుండా, శాంతిభద్రతల సమస్యగా కూడా మారుతోందని మాధవ్ తెలిపారు. సముద్రంలో తరచుగా వివాదాలు, గొడవలు చోటుచేసుకుంటున్నాయని, కొన్ని సందర్భాల్లో ఈ చిన్నపాటి గొడవలే ఉద్రిక్త పరిస్థితులు మారుతున్నాయన్నారు. దీంతో ఏపీ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారన్నారు.
పీవీఎన్ మాధవన్ విన్నవించిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల సమస్యలను ప్రాధాన్యంగా పరిగణించి పరిష్కార మార్గాలు అన్వేషిస్తామన్నారు.





