చిన్న కాంట్రాక్టర్లకు ‘ప్రజా ప్రభుత్వం’ అండ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Must read

రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజా ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. మంగళవారం ప్రజాభవన్ లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేయగా, ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.


చిన్న కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఆర్థిక శాఖ ప్రతినెలా నిరంతరాయంగా బిల్లులను చెల్లిస్తోందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క వారికి గుర్తుచేశారు. పెండింగ్ బకాయిల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని ఆయన వివరించారు. రాష్ట్రంలో చిన్న కాంట్రాక్టర్లకు దశలవారీగా పెండింగ్ బిల్లులన్నింటినీ పూర్తిగా చెల్లించి చిన్న కాంట్రాక్టర్లను ఆదుకుంటామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు.


అంతకుముందు, ఈ రోజు మధ్యాహ్నం కాంట్రాక్టర్ల ప్రతినిధులు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో చర్చలు జరిపారు. అనంతరం ప్రజాభవన్‌కు చేరుకుని, మంత్రి కోమటిరెడ్డితో జరిగిన చర్చల సారాంశాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు.

‘చలో హైదరాబాద్’ వాయిదా: రవీందర్ రెడ్డి
పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఇచ్చిన సానుకూల హామీతో తాము ఎంతో సంతృప్తి చెందామని, ఈ నెల 18న చేపట్టదలచిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్మన్ రవీందర్ రెడ్డి ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా అండగా నిలిచిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు అసోసియేషన్ తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు వి. సత్యమూర్తి, మాజీ జాతీయ అధ్యక్షులు ఎస్.ఎన్. రెడ్డి, మాజీ ఉపాధ్యక్షులు డి.వి.ఎన్. రెడ్డి, సుగుణాకర్ రావు, భాస్కర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ప్రభాకర్, శ్యామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!