బెంగళూరు నగరంలో వాహనాలు కలిగి ఉన్న వారికి కొత్త పార్కింగ్ నిబంధనలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఇంటి ముందు ఉన్న పబ్లిక్ రోడ్డుపై వాహనాన్ని నిలిపే వారికి ఇకపై ఉచిత పార్కింగ్‌కు అవకాశం లేకుండా, వార్షిక రుసుముతో కూడిన ‘రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్’ విధానాన్ని తీసుకురావాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) పరిధిలో అమలు చేయనున్న ‘పార్కింగ్ రూల్స్-2026’ ముసాయిదాలో ఈ నిబంధనలను పొందుపరిచారు. ముసాయిదా ప్రకారం వాహనం రకాన్ని బట్టి ఏటా రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పర్మిట్ ఫీజు చెల్లించాల్సి రావచ్చు. అయితే ఇది ప్రస్తుతం ముసాయిదా ప్రతిపాదన మాత్రమే, తుది నిబంధనగా అమల్లోకి రాలేదు.
ప్రతిపాదిత నిబంధనల ప్రకారం హ్యాచ్‌బ్యాక్ లేదా చిన్న కార్లకు సంవత్సరానికి రూ.15,000, సెడాన్ కార్లకు రూ.20,000, ఎస్‌యూవీలకు రూ.25,000 చొప్పున కనీస వార్షిక పర్మిట్ ఫీజును నిర్ణయించారు. దీనికి అదనంగా అడ్మినిస్ట్రేటివ్ ఫీజు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ ఫీజును గ్రేటర్ బెంగళూరు అథారిటీ చీఫ్ కమిషనర్ నిర్ణయించే అవకాశం ఉందని ముసాయిదాలో పేర్కొన్నారు. అంటే ఒక కుటుంబం ఇంటి ముందు పబ్లిక్ రోడ్డుపై ఎస్‌యూవీని నిలిపేందుకు అనుమతి కోరితే ఏడాదికి రూ.25 వేల వరకు చెల్లించాల్సి రావచ్చు. అయితే డబ్బులు చెల్లిస్తే ప్రతి ఒక్కరికీ పర్మిట్ లభిస్తుందనే పరిస్థితి లేదు. ఇందులో అత్యంత కీలకమైన నిబంధనను ప్రభుత్వం ప్రతిపాదించింది. భవన నిర్మాణ నిబంధనల ప్రకారం కనీస పార్కింగ్ సౌకర్యం కలిగి ఉన్న భవనాల్లో నివసించే వారికి మాత్రమే రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ జారీ చేసే అవకాశం ఉంటుంది. అంటే భవన నిర్మాణ సమయంలోనే నిర్దేశించిన కనీస పార్కింగ్ స్థలం కల్పించని ఇళ్లు లేదా అపార్ట్మెంట్లలో నివసించే వారు పబ్లిక్ రోడ్డుపై వాహనం నిలిపేందుకు పర్మిట్ పొందలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఇంటి ముందు రోడ్డుపై పార్కింగ్ చేస్తే అది నిబంధనల ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంది.
పర్మిట్ ఒక నిర్దిష్ట వాహనం, దాని రిజిస్ట్రేషన్ పేరుతో అనుసంధానమై ఉంటుంది. ఇది ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. అనంతరం సంబంధిత వ్యక్తి అదే ప్రాంతంలో నివసిస్తున్నాడా లేదా అనే వివరాలను పరిశీలించి పునరుద్ధరించే విధానాన్ని ప్రతిపాదించారు. అంతేకాకుండా ఇంటి దగ్గర ఎక్కడైనా వాహనాన్ని నిలిపేందుకు అనుమతి ఉండదు. రెసిడెన్షియల్ పార్కింగ్ కోసం ప్రత్యేకంగా గుర్తించిన రోడ్లలో, నివాసితుడి ఇంటికి నడిచే దూరంలో ఉన్న ప్రాంతాల్లోనే వాహనాన్ని పార్క్ చేయాల్సి ఉంటుంది. రోడ్డుపై వాహనం నిలిపిన తర్వాత కూడా రహదారిపై తగినంత స్థలం మిగలాల్సి ఉంటుంది. కలెక్టర్ లేదా నాన్-ఆర్టీరియల్ రోడ్లపై వాహనం పార్క్ చేసిన తర్వాత ట్రాఫిక్ కోసం కనీసం ఆరు మీటర్ల రహదారి ఖాళీగా ఉండాలి. అలాగే ఇరువైపులా 1.8 మీటర్ల మేర నడక మార్గం అందుబాటులో ఉండేలా చూడాలి. స్థానిక రోడ్ల విషయంలో కనీసం నాలుగు మీటర్ల రహదారి భాగం ట్రాఫిక్‌కు అందుబాటులో ఉండాలి. కనీసం ఒకవైపు 1.8 మీటర్ల క్లియర్ వాకింగ్ స్పేస్ ఉండాలని ప్రతిపాదించారు.
ఈ నిబంధనల వెనుక ప్రధాన ఉద్దేశం నగరంలో రోడ్లను దీర్ఘకాలిక పార్కింగ్ స్థలాలుగా ఉపయోగించకుండా నియంత్రించడమేనని అధికారులు చెబుతున్నారు. బెంగళూరులో వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో రోడ్ల పక్కన ఇష్టానుసారంగా వాహనాలు నిలపడం వల్ల ట్రాఫిక్ రద్దీ, పాదచారులకు ఇబ్బందులు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పబ్లిక్ రోడ్డు స్థలం పరిమితంగా ఉన్న నేపథ్యంలో దాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు పార్కింగ్‌కు ధర నిర్ణయించే విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. రెసిడెన్షియల్ పార్కింగ్ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో రోడ్డు పక్కన పార్కింగ్‌కు కూడా గంటల వారీగా ఫీజులు ప్రతిపాదించారు. రోడ్డు కేటగిరీని బట్టి కార్లకు గంటకు రూ.40 నుంచి రూ.80 వరకు, ద్విచక్ర వాహనాలకు రూ.20 నుంచి రూ.40 వరకు చార్జీలు ఉండే అవకాశం ఉంది. రోడ్లపై ఎక్కువసేపు వాహనాలు నిలిపి ఉంచకుండా చేయడానికి రెండు గంటల తర్వాత పార్కింగ్ రుసుములను పెంచే విధానాన్ని కూడా ముసాయిదాలో ప్రతిపాదించారు.
దీనికి భిన్నంగా ఆఫ్-స్ట్రీట్ పార్కింగ్‌ను ప్రోత్సహించేలా తక్కువ రుసుములను ప్రతిపాదించారు. కార్లకు గంటకు సుమారు రూ.20 నుంచి రూ.40 వరకు, ద్విచక్ర వాహనాలకు రూ.10 నుంచి రూ.20 వరకు చార్జీలు ఉండవచ్చు. నెలవారీ ఆఫ్-స్ట్రీట్ పార్కింగ్‌కు రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ఫీజు ఉండే అవకాశం ఉంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య నెలవారీ పార్కింగ్ రేట్లపై 50 శాతం వరకు రాయితీ ఇచ్చే ప్రతిపాదన కూడా ఉంది. నిబంధనలను పర్యవేక్షించేందుకు సిటీ కార్పొరేషన్లకు చెందిన మార్షల్స్ లేదా నియమిత అధికారులు పార్కింగ్ పర్మిట్లను తనిఖీ చేయనున్నారు. పర్మిట్ లేకుండా నిర్ణయించిన ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వివరాలను పోలీసులకు నివేదించే అవకాశం ఉంటుంది. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నో-పార్కింగ్ నిబంధనలను అమలు చేయడంతో పాటు అనుమతి ఉన్న వాహనాలకే నిర్దేశిత రెసిడెన్షియల్ పార్కింగ్ ప్రాంతాల్లో స్థానం కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు.
అయితే ఈ ప్రతిపాదనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పాతకాలం నుంచి ఉన్న ఇళ్లలో లేదా పార్కింగ్ నిబంధనలు అమల్లోకి రాకముందే నిర్మించిన భవనాల్లో తగినంత పార్కింగ్ సౌకర్యం లేకపోతే పరిస్థితి ఏమిటన్నది కీలక ప్రశ్నగా మారుతోంది. ఇంటి లోపల పార్కింగ్ ఏర్పాటు చేసే అవకాశం లేకపోయినా, బయట రోడ్డుపై వాహనం నిలిపేందుకు పర్మిట్ ఇవ్వకపోతే నివాసితులు ప్రత్యామ్నాయం వెతకాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధనలు తుది రూపం దాల్చలేదు. కర్ణాటక ప్రభుత్వం ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరుతోంది. గెజిట్‌లో ప్రచురించిన అనంతరం 30 రోజుల వ్యవధిలో ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఆ అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత తుది నిబంధనల్లో మార్పులు చేసే అవకాశం ఉంటుంది.





