కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో బాధితురాలి తల్లి విడుదల చేసిన లేఖ రాజకీయ, సామాజిక వర్గాల్లో సంచలనం రేపుతోంది. తన కుమార్తెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పోరాటం చేస్తున్నామని, దీనికి ఎలాంటి రాజకీయ సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.
బాధితురాలి తల్లి వివరాల ప్రకారం, 2025లో తన కుమార్తెకు బండి భగీరథ్‌తో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆ తర్వాత అతడు తన కుమార్తెపై శారీరక సంబంధాల కోసం ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31 రాత్రి మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘటనలను ఆమె లేఖలో ప్రస్తావించారు. అక్కడ మద్యం సేవించమని బలవంతం చేసి, తన కుమార్తెతో అత్యంత అనుచితంగా ప్రవర్తించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలకు సంబంధించిన చాట్స్, మెసేజ్‌లు, డిజిటల్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. నిందితుడు క్షమాపణలు కోరిన సందేశాలు కూడా తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది మే 8న తాము పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించామని, అయితే మైనర్ బాలికకు సంబంధించిన కేసు అయినప్పటికీ పోలీసులు వెంటనే కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. సుమారు ఐదు గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో నిరీక్షింపజేశారని, ఒత్తిడి చేసిన తర్వాతే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు.
తరువాత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుతో విచారణ వేగవంతమైందని చెప్పారు. ప్రస్తుతం బండి భగీరథ్‌పై కఠినమైన నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని సమాచారం. ఇదే సమయంలో పోలీసుల నోటీసులకు స్పందించిన భగీరథ్, విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల సమయం కోరినట్లు తెలిసింది.
ఈ వ్యవహారంలో రాజీ ప్రయత్నాలు, బెదిరింపులు కూడా ఎదురయ్యాయని బాధితురాలి తల్లి ఆరోపించారు. ఏప్రిల్ 23న తాము స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసినప్పటికీ, తమకు భరోసా లభించలేదని పేర్కొన్నారు. తమ కుటుంబంపై రివర్స్ కేసులు పెట్టి నిందితుల్లా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆమె వాపోయారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం జరుగుతోందని, తమకు రక్షణ కల్పించాలని ఆమె మహిళా కమిషన్, న్యాయవ్యవస్థను కోరారు. ఈ కేసుపై స్వతంత్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికి తీయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.





