ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజల ఆస్తులకు చట్టబద్ధమైన భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి చెందిన ఇళ్లు, స్థలాలు, వాణిజ్య ఆస్తులు తదితర వివరాలతో కూడిన ప్రత్యేక “ప్రాపర్టీ కార్డు”లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ద్వారా ఆస్తి యాజమాన్యంపై స్పష్టత పెరగడంతో పాటు భవిష్యత్తులో వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గతంలో నిలిచిపోయిన (నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ సర్వేను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే అమలవుతున్నసామిత్వా స్తీమ్ తరహాలోనే పట్టణ ప్రాంతాల్లోనూ ఆస్తుల నమోదును ఆధునిక సాంకేతికతతో చేపట్టనున్నారు. డ్రోన్లు, జీఐఎస్ (Geographic Information System) వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి ప్రతి ఆస్తిని ఖచ్చితంగా మ్యాపింగ్ చేసి డిజిటల్ రికార్డులను సిద్ధం చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం 2024లో ఈ ‘నక్ష’ ప్రాజెక్టును ప్రారంభించి దేశవ్యాప్తంగా 152 నగరాలు, పట్టణాలను ఎంపిక చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఖ్య నగరాలు అయిన కాకినాడ, ఏలూరు, గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కుప్పం, అనంతపురం వంటి తొమ్మిది పట్టణాలు ఉన్నాయి.
గత ప్రభుత్వ హయాంలో ఈ నగరాల్లో సర్వే ప్రక్రియ కొంతవరకు ప్రారంభమైనప్పటికీ, ఆస్తి రికార్డుల నమోదు, డిజిటల్ మ్యాపింగ్ వంటి కీలక దశలు పూర్తికాలేదు. దీంతో ప్రాజెక్టు మధ్యలోనే నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రతి ఆస్తికి యూనిక్ ఐడీతో కూడిన ప్రాపర్టీ కార్డు అందించబడుతుంది. దీనివల్ల బ్యాంకు రుణాలు పొందడం సులభమవుతుంది. అలాగే భూ వివాదాలు, అక్రమ ఆక్రమణలు, డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు వంటి సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశముంది.
ప్రభుత్వం ఈ సర్వేను దశలవారీగా అమలు చేస్తూ 2027 మార్చి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు.





