ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియా వేదికల నుంచి పూర్తిగా దూరంగా ఉంచేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డిజిటల్ యుగంలో పిల్లల భద్రతకు ఇది ఒక ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు.
ఉండవల్లిలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రుల బృందం, ఉన్నతాధికారులు, ప్రముఖ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా మెటా, యూట్యూబ్ వంటి సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, పిల్లల్లో సృజనాత్మకతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. చిన్న వయసులోనే సోషల్ మీడియా ప్రభావం వల్ల వారి మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జాగ్రత్తలు అవసరమన్నారు.
ప్రత్యేకంగా 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు సంబంధించిన నియంత్రణలపై కూడా చర్చించారు. ఈ వయస్సు గల పిల్లలకు వారి వయసుకు తగిన కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా ప్రత్యేక విధివిధానాలు రూపొందించాలని సూచించారు. దీనికోసం టెక్నాలజీ ఆధారిత ఫిల్టర్లు, వయస్సు నిర్ధారణ పద్ధతులు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం, విద్వేషపూరిత కంటెంట్‌ను ప్రచారం చేయడం వంటి సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిపారు. మహిళలపై అసభ్యకర కంటెంట్
వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
చిన్నారులను సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరంగా ఉంచడం సవాలుతో కూడుకున్న పని. అయినా సరైన నియంత్రణలు, అవగాహన కార్యక్రమాలు, తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటే ఈ సమస్యను కొంతవరకు నియంత్రించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, సోషల్ మీడియా కంపెనీలు కూడా ఈ విషయంలో తమ బాధ్యతను గుర్తించి, పిల్లల భద్రతకు సంబంధించిన విధానాలను మరింత కట్టుదిట్టం చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే, దేశంలోనే మొదటిసారిగా పిల్లల కోసం ప్రత్యేక సోషల్ మీడియా నియంత్రణ చట్టం అమలు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. దీంతో ఇతర రాష్ట్రాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుంది.





