తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠపై ప్రముఖ కోలీవుడ్ నటుడు విశాల్ స్పందించారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని ఆయన గవర్నర్‌ను డిమాండ్ చేశారు. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఇప్పటివరకు విజయ్ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంపై విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రజలు స్పష్టంగా టీవీకే పార్టీకి అత్యధిక స్థానాలు ఇచ్చారు. దాదాపు మెజారిటీకి చేరువలో ఉన్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఎందుకు ఆహ్వానించడం లేదు?” అని ప్రశ్నించారు.
గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాలను కూడా విశాల్ గుర్తుచేశారు. ముఖ్యంగా 2017-18 కాలంలో కర్ణాటక, గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సందర్భాల్లో గవర్నర్లు శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాలని కోరుతూ ఫ్లోర్ టెస్ట్‌కు అవకాశం ఇచ్చారని చెప్పారు.
“అప్పుడు పాటించిన రాజ్యాంగ సంప్రదాయాలు ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు? విజయ్‌కు కూడా అదే అవకాశం ఇవ్వాలి కదా. ప్రజా తీర్పుకు ఇదేనా గౌరవం?” అంటూ విశాల్ సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వం త్వరగా ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. “తమిళనాడుకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కావాలి. గవర్నర్ పాలన కాదు” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
టీవీకే పార్టీ ఈసారి తమిళనాడు రాజకీయాల్లో సంచలన ఫలితాలు నమోదు చేసింది. నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా నిలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యువత, పట్టణ ఓటర్ల మద్దతుతో టీవీకే భారీ విజయాన్ని నమోదు చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఇప్పటికే విజయ్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ, ఇంకా మేజిక్ ఫిగర్‌కు కొంత దూరం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది.
ఇప్పటికే సీపీఐ, వీసీకే, డీఎంకే వంటి పార్టీలు కూడా టీవీకేకు తొలి అవకాశం ఇవ్వాలని కోరాయి. తాజాగా కమల్ హాసన్ కూడా ప్రజా తీర్పును గౌరవించాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు విశాల్ కూడా అదే తరహాలో స్పందించడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం ఆలస్యం అవుతుండటంపై విమర్శలు పెరుగుతున్నాయి. విజయ్ ఇప్పటికే గవర్నర్‌ను పలుమార్లు కలిసి తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.





