తెలంగాణ రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి, ప్రజలకు అత్యుత్తమ స్థాయి డిజిటల్ సేవలను అందించేందుకు వీలుగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి మీ సేవ కేంద్రాన్ని ఆధునికీకరించి, ప్రజలకు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా పారదర్శక సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌నకు చెందిన డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందంతో ప్రధాన కార్యదర్శి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో రాష్ట్ర ఐటీ, డిజిటల్ రంగానికి చెందిన పలు ప్రాజెక్టులపై ఇరువర్గాలు విస్తృతంగా చర్చించాయి.
ఈ సమావేశంలో ప్రధానంగా ‘డిజిటల్ ఇండియా – వికసిత్ భారత్–2047’ లక్ష్యాల సాధనలో భాగంగా రాష్ట్రంలో మీ సేవ కేంద్రాల ఆధునీకరణకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. దీనితో పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అధునాతన డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, ఐటీ రంగాన్ని ఆధారం చేసుకుని స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించడం వంటి అంశాలపై ప్రతినిధులు లోతుగా చర్చించారు.
డిజిటల్ గవర్నెన్స్ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేస్తున్న సంస్కరణలు, ప్రవేశపెడుతున్న నూతన సాంకేతికతను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో డిజిటల్ సామర్థ్యాలను గణనీయంగా పెంచడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం, ప్రజా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడం, డేటా గవర్నెన్స్ వంటి విభాగాల్లో ప్రపంచ బ్యాంక్ నుంచి అందించగల సాంకేతిక సహాయం, జ్ఞాన భాగస్వామ్యం , అంతర్జాతీయ అత్యుత్తమ విధానాలపై మహేష్ ఉత్తమ్‌చందానీ తన అభిప్రాయాలను వెల్లడించారు.
దేశంలో డిజిటల్, సాంకేతిక రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి హర్యానాతో పాటు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలంగా ఉందని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కొనియాడారు. ఈ క్రమంలోనే సుమారు రూ. 2,000 కోట్ల విలువైన పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను త్వరగా సిద్ధం చేసి తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం అనంతరం, రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న టి-ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన డిజిటల్ సేవల లభ్యత తదితర కీలక అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
టి-ఫైబర్ ప్రాజెక్టు కింద చేపడుతున్న పనులన్నింటినీ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి, రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి, ప్రభుత్వ కార్యాలయానికి నాణ్యమైన డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎస్ ఆదేశించారు. విభిన్న ప్రభుత్వ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం సాధించి, ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే క్షేత్రస్థాయి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పనుల పురోగతిని ప్రతి వారం నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దూరిశెట్టి, ప్రపంచ బ్యాంక్ డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ, టి-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు వివిధ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





