తూర్పుకాపులకు ఓబీసీ రిజర్వేషన్‌ కల్పించేలా కృషి చేయాలి:వైయస్‌ జగన్‌కు వినతి

Must read

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ను తూర్పుకాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ప్రతినిధులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. తూర్పుకాపులకు ఓబీసీ రిజర్వేషన్‌ వర్తించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తూర్పుకాపులను బీసీలుగా గుర్తిస్తూ జీవో నంబర్‌ 82 జారీ చేసిన విషయాన్ని సంఘం ప్రతినిధులు గుర్తుచేశారు.

అయితే, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన తూర్పుకాపులకు కేంద్ర ఓబీసీ రిజర్వేషన్‌ వర్తించకపోవడంతో విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రస్థాయిలో బీసీ గుర్తింపు ఉన్నప్పటికీ, కేంద్ర ఓబీసీ జాబితాలో తగిన గుర్తింపు లేకపోవడం వల్ల కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందడం లేదని వివరించారు. ఈ సమస్య కారణంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది తూర్పుకాపు విద్యార్థులు, నిరుద్యోగ యువత అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు.

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ (NCBC) ఆధ్వర్యంలో పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించిన విషయాన్ని సంఘం ప్రతినిధులు ప్రస్తావించారు. అప్పటి ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తూర్పుకాపుల సమస్యను ఓబీసీ కమిషన్‌ ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారని గుర్తుచేశారు.ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో తూర్పుకాపుల సమస్యను ప్రస్తావించి, వారిని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకుంటే లక్షలాది మంది ప్రయోజనం పొందుతారని వైయస్‌ జగన్‌కు వివరించారు.

ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన తూర్పుకాపు సామాజిక వర్గ ప్రజలు ఉపాధి, విద్య, ఉద్యోగాల కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు, యువత కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యా, ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఒక ప్రాంతంలో నివసించడం లేదా విద్య, ఉపాధి కోసం మరో ప్రాంతానికి వెళ్లడం కారణంగా సామాజిక వర్గానికి లభించాల్సిన రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర స్థాయిలో బీసీ గుర్తింపు ఉన్నప్పటికీ కేంద్ర ఓబీసీ జాబితాలో తగిన స్థాయిలో గుర్తింపు లేకపోవడం వల్ల తూర్పుకాపు యువత అనేక అవకాశాలను కోల్పోతున్నారని సంఘం ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా కేంద్ర విశ్వవిద్యాలయాలు, జాతీయ స్థాయి విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల సమయంలో ఓబీసీ రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందలేకపోతున్నామని చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ రిజర్వేషన్‌ ద్వారా లభించే అవకాశాలు అందకపోవడం వల్ల విద్యావంతులైన యువతకు అన్యాయం జరుగుతోందని వివరించారు.

తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్నప్పటికీ.. కేంద్ర ఓబీసీ రిజర్వేషన్‌ ప్రయోజనం అందకపోవడం వల్ల పోటీ మరింత కఠినంగా మారుతోందని ప్రతినిధులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు రిజర్వేషన్‌ అనేది ఉన్నత విద్యలో కీలకమైన అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రయోజనం అందుబాటులో లేకపోవడం వల్ల అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులు తమకు లభించాల్సిన అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు.సంఘం ప్రతినిధులు వివరించిన సమస్యలను శ్రీ వైయస్‌ జగన్‌ సావధానంగా విన్నారు. తూర్పుకాపుల న్యాయమైన డిమాండ్‌కు వైఎస్సార్‌సీపీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ ఎంపీల ద్వారా ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించేలా కృషి చేస్తామని, తూర్పుకాపులకు ఓబీసీ రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో తూర్పుకాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం అధ్యక్షుడు లోపింటి చిరంజీవి, ఓబీసీ ప్రతినిధులు కోడిగుడ్ల రాంబాబు, తుమ్మగుంట రంగారావు, ఆర్‌.ఎస్‌. నాయుడు, రౌతు వెంకట చిన్నబాబు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఉన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!