ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ తెలిపారు. లోక్సభలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం’ (ఎంఎస్ఈ-సీడీపీ) కింద ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మొత్తం 47 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టించబడుతున్నాయని వివరించారు.
ఈ ప్రాజెక్టులలో 11 ఉమ్మడి సౌకర్యాల కేంద్రాలు (సీఎఫ్సీలు), 36 మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు (ఐడీలు) ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన ప్రాజెక్టుల ద్వారా సుమారు 66,093 మందికి ఉపాధి లభించిందన్నారు. ఇందులో సీఎఫ్సీల ద్వారా 8,300 మందికి, ఐడీ ప్రాజెక్టుల ద్వారా 57,793 మందికి ఉపాధి దక్కిందని వెల్లడించారు.ప్రధానంగా మచిలీపట్నంలో ఇమిటేషన్ జ్యువెలరీ క్లస్టర్, విజయవాడ మరియు జగ్గయ్యపేటలో గోల్డ్ ఆర్నమెంట్ క్లస్టర్లు, రాయవరంలో పప్పుధాన్యాల క్లస్టర్, కాకినాడలో ప్రింటింగ్ క్లస్టర్లు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు.
అదేవిధంగా రాజమండ్రిలో ఫర్నిచర్, నెల్లూరులో హోజరీ మరియు రెడీమేడ్ దుస్తులు, తిరుపతిలో ప్రింటింగ్, శ్రీకాకుళంలో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధిని పెంచేందుకు పాత ఎస్టేట్ల ఆధునీకరణతో పాటు కొత్త పారిశ్రామిక ఎస్టేట్ల నిర్మాణం కూడా చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. తడ, నంద్యాల వంటి ప్రాంతాల్లో పాత ఎస్టేట్లు ఆధునీకరించబడగా, కొప్పర్తి, గండ్రాజుపల్లిలో కొత్త పారిశ్రామిక ఎస్టేట్లు నిర్మాణం పూర్తయింది.మహిళల సాధికారతపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. ‘పీఎం విశ్వకర్మ’ పథకం కింద రాష్ట్రంలో 90,207 మంది మహిళలకు శిక్షణ అందించగా, ‘పీఎంఈజీపీ’ పథకం ద్వారా 1,56,567 మహిళా నేతృత్వంలోని సూక్ష్మ పరిశ్రమలకు మద్దతు అందించినట్లు వివరించారు. గత ఐదేళ్లలో 28,388 మంది మహిళలు నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ద్వారా లాభపడ్డారని తెలిపారు.
ఈ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయంలో 60 నుంచి 70 శాతం వరకు గ్రాంట్లు అందిస్తోందని, మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆస్పిరేషనల్ జిల్లాల్లో చేపట్టే ప్రాజెక్టులకు గరిష్టంగా 80 శాతం వరకు ఆర్థిక సహాయం లభిస్తుందని వెల్లడించారు.





