దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాలనలోనే కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గతంలో రాజకీయ జోక్యంతో, ఫోన్ కాల్స్ ఆధారంగా రుణాల మంజూరు జరిగేదని, ప్రస్తుతం మాత్రం ప్రజల అవసరాలు, అర్హతలను పరిశీలించి బ్యాంకులు నేరుగా గ్రామాలకు వెళ్లి సేవలు అందిస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రభుత్వ రంగ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన ‘క్రెడిట్ అవుట్రీచ్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న నిర్మలా సీతారామన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, “బ్యాంకులు ప్రజల వద్దకు వెళ్లాలి.. ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండకూడదు” అనే భావనతోనే ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంస్కరణలను తీసుకొచ్చారని తెలిపారు. గతంలో 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకుల ఫోన్ కాల్స్ ఆధారంగా రుణాలు మంజూరు చేసే పరిస్థితులు ఉండేవని ఆమె విమర్శించారు. బ్యాంకుల స్వతంత్ర నిర్ణయాలకు అడ్డంకులు ఏర్పడటంతో పాటు ప్రజల నమ్మకం దెబ్బతిన్నదని పేర్కొన్నారు.
అయితే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అర్హులైన రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందాలనుకునే వ్యక్తులు, చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమల యజమానులు సులభంగా రుణాలు పొందేలా అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు గ్రామాల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ, ప్రజల అవసరాలను గుర్తించి తక్షణమే రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి ముద్ర యోజన, స్టాండ్ అప్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా, పీఎం స్వనిధి వంటి పథకాల ద్వారా లక్షలాది మంది స్వయం ఉపాధి అవకాశాలను పొందుతున్నారని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా వీధి వ్యాపారుల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ఆమె వెల్లడించారు. చిన్న వ్యాపారులు అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులపై ఆధారపడకుండా, ప్రభుత్వమే గ్యారెంటీగా నిలిచి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తోందని చెప్పారు. దీనివల్ల వేలాది మంది వీధి వ్యాపారులు తమ జీవనోపాధిని మరింత అభివృద్ధి చేసుకుంటున్నారని వివరించారు.
మహిళల ఆర్థిక సాధికారతకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు పెద్దఎత్తున రుణాలు అందించడంతో పాటు మైక్రో ఫైనాన్స్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి కుటుంబ ఆదాయాన్ని పెంచుకునేలా బ్యాంకులు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాయని వివరించారు.
అధిక వడ్డీకి అప్పులు ఇచ్చే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన ప్రజలు పడకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నాయని ఆమె తెలిపారు. బ్యాంకింగ్ సేవలను ప్రతి గ్రామానికి చేరవేయడం, ప్రతి అర్హుడికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బ్యాంకింగ్ రంగం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంటూ, పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో బ్యాంకుల సహకారం మరింత పెరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడులను ఆకర్షించే విధంగా అనేక సంస్కరణలు చేపడుతోందని తెలిపారు.





