బోనం ఎత్తిన కొండా సురేఖ

Must read

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల మహోత్సవాలు చారిత్రాత్మక గోల్కొండ కోటలో గురువారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ బోనాలు, డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో గోల్కొండ కోట పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.

ఉత్సవాల ప్రారంభ సందర్భంగా లంగర్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున వారు శ్రీ గోల్కొండ జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా మంత్రి కొండా సురేఖ బోనం ఎత్తడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు ఆసక్తిగా వీక్షించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలను చాటుకోగా, ఆలయ ప్రాంగణం జై మహంకాళి నినాదాలతో మారుమోగింది.

ప్రభుత్వం తరఫున ప్రతి ఏడాది నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా మొదటి ‘బంగారు బోనంను మంత్రులు అధికారికంగా సమర్పించారు. బోనాల ఉత్సవాల్లో బంగారు బోనం సమర్పణకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండగా, ఈ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించారు.

ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ, రూ.11 లక్షల విలువైన చెక్కును ఆలయ కమిటీకి మంత్రులు అందజేశారు. ఈ నిధులను ఆలయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన, ఆలయ నిర్వహణకు వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.

గోల్కొండ బోనాలు తెలంగాణలో జరిగే బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుడతాయి. ఇక్కడ ప్రారంభమైన వేడుకలు అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం, లాల్‌దర్వాజా మహంకాళి ఆలయం సహా నగరంలోని అనేక ఆలయాల్లో ఘనంగా కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆలయ పరిసరాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, అత్యవసర సేవలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టారు.

గోల్కొండ కోట పరిసర ప్రాంతాలు రంగురంగుల అలంకరణలతో ఆకట్టుకున్నాయి. డప్పు బృందాలు, జానపద కళాకారుల ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు బోనాల ఉత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చాయి. కుటుంబ సమేతంగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!