‘నేను తెలంగాణ ఆత్మను అర్ధం చేసుకున్నవాడిని. ఇక్కడి నేల, పోరాటం, త్యాగాలు అన్ని నాకు స్ఫూర్తినిచ్చాయి. తెలంగాణలో కులరహితంగా యువత సాగించే హక్కుల పోరాటాలు ఎంతో విలువైనవి. ఇది పోరాటాల నేల.. ధన్యభూమి. తెలంగాణ గడ్డ నుంచే జనసేన ప్రస్థానం మొదలైంది. దేశ సమగ్రతను కాపాడుతూ, తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు ప్రతిఫలించేలా, ప్రతిబింబించేలా సిద్ధాంతపరమైన భావజాలంతో తెలంగాణలో జనసేన పార్టీ తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంద’ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తెలంగాణ పార్టీ నాయకుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కొబ్బరికాయ కొట్టి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కొత్తగా పార్టీలో చేరిన వారి సమక్షంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ప్రయాణం ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘జనసేన పార్టీ సిద్దాంతాలు భావజాలాన్ని నమ్మి నాతో ఇంతకాలం ప్రయాణం చేసిన నాయకులు ఇక మీదట కీలక భూమిక పోషించాలి. కొత్తగా వచ్చిన వారికి పార్టీ భావజాలం అర్ధం అయ్యేలా దిశానిర్దేశం చేయాలి.
తెలంగాణలో గొప్ప మేధావులు, పోరాట యోధులు, కవులు, కళాకారులున్నారు. దాశరథి కృష్ణమాచార్యులు, చాకలి ఐలమ్మ, కాళోజీ, సర్వాయి పాపన్న వంటి ఇంకెందరో గొప్పవారు ఉన్న ఈ నేల జనసేన పార్టీకి కీలకం కానుంది. జనసేన పార్టీ సిద్ధాంతాలు విస్తరిస్తున్నాయి. కేరళం, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లోని వారు సైతం పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు వస్తున్నారు.
ఒకప్పుడు తెలంగాణలో చిన్నగా ఎలా అయితే పార్టీ మొదలైందో అలాగే ఆయా రాష్ట్రాల్లోనూ ఇప్పుడు పార్టీకి బలం వస్తోంది. తెలంగాణలో ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్య మీద, సమాజాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశం మీద నాయకులు అడ్రెస్ చేయండి. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకుండా, కేవలం విధానపరమైన అంశాల మీద గట్టిగా కొట్లాడండి. లోతుగా చర్చించి, విషయం ప్రజలకు అర్ధం అయ్యేలా వివరించండి. అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం, న్యాయం చేసేలా సామాజిక తెలంగాణకు కట్టుబడి ముందుకు వెళ్లాం. మీకు తోడుగా లక్షలాది మంది జనసైనికులు, వీర మహిళలున్నారు. వారు మీ పోరాటాలకు స్ఫూర్తి పొందితే కోట్లాది మంది అవుతారు. తెలంగాణకు ఆయువుపట్టుగా మారుతారు… జై భారత్… జై తెలంగాణ ’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి,రామ్ తాళ్లూరి, కోశాధికారి ఎ.వి.రత్నం, పార్టీ తెలంగాణ ఇంఛార్జి ఎన్ శంకర్ గౌడ్, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారాం రాజలింగం, పార్టీ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, ఆర్ కే సాగర్, తనీష్, సంపత్ నాయక్, సతీష్ రెడ్డి, సురేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మచ్చా సుధాకర్, ప్రజీత్ గౌడ్, రాజేష్, దాసరి రవీష్, వీర మహిళలు కావ్య, లిఖిత, శిరీష,నిహారిక తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన వారిలో…. కుత్భుల్లాపూర్ నుంచి ముదునూరు నరసింహా, గాయత్రి ముదునూరి, చేవెళ్ల నుంచి తనూజ రెడ్డి, దుబ్బాక నుంచి బాగన్నగారి రవీందర్ రెడ్డి, శంషాబాద్ నుంచి కె. శ్రీనివాసరెడ్డి, శేరిలింగంపల్లి నుంచి షేక్ ఫరీద్, మేడూరి సరస్వతి, మలక్ పేట నుంచి బి. విజయరామరావు, పాల్వంచ నుంచి లత్తి మురళి, వరంగల్ నుంచి డాక్టర్ పద్మజా దేవి, సనత్ నగర్ నుంచి ఉమామహేశ్వరరావు, సూర్యాపేట నుంచి ఆకుల వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి భానుప్రకాష్, హైదర్ గూడ నుంచి గోడాల భాస్కర్, ఎల్బీ నగర్ నుంచి శోభన్ బాబు, రాజేంద్రనగర్ నుంచి పర్వేందర్ సింగ్, కూకట్ పల్లి నుంచి చ్చటి మురళీ ఉన్నారు.





