తెలంగాణ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలోని 24 మంది పోలీస్ కానిస్టేబుళ్ల కోసం నిర్వహించిన 10 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణా కార్యక్రమం జూన్ 8 నుంచి జూన్ 19, 2026 వరకు తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాల సందర్భాల్లో స్థానిక దర్యాప్తు అధికారులకు సమర్థవంతంగా సహకరించడం, ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించడం, ప్రమాదాలపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించడం, ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడం వంటి లక్ష్యాలతో ఈ కోర్సును రూపొందించారు. యువ కానిస్టేబుళ్లలో ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించేందుకు 24 మంది సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ అందించారు.
ఈ కోర్సులో పోలీసు శాఖకు చెందిన సీనియర్ డీఎస్పీ స్థాయి అధికారులు, న్యాయ నిపుణులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు, వైద్య నిపుణులు మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షకులు విస్తృతంగా తరగతులు నిర్వహించారు.
శిక్షణలో భాగంగా కేసు నమోదు నుంచి చార్జ్‌షీట్ దాఖలు వరకు అనుసరించాల్సిన విధానాలు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, సాక్ష్యాధారాల సేకరణ, వాటిని ఫోరెన్సిక్ ప్రయోగశాలలకు పంపించడం, ప్రమాద బాధితులకు రక్షణ మరియు వైద్య సహాయం అందించడం, డాక్యుమెంటేషన్ నిర్వహణ తదితర అంశాలపై సైద్ధాంతిక మరియు ప్రాయోగిక శిక్షణ అందించారు.
అదేవిధంగా మోటార్ వాహనాల చట్టం, ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ నియంత్రణ పద్ధతులు, తెలంగాణ పోలీస్ శాఖ వినియోగిస్తున్న టీ ఎస్ ఆప్స్, అత్యవసర స్పందన విధానాలపై ప్రత్యేక పాఠాలు బోధించారు.
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి అభిలాష్ బిస్త్, IPS ప్రత్యేక చొరవతో ఈ కోర్సును నిర్వహించారు. కోర్సు డైరెక్టర్‌గా శ్రీ సతీష్ కుమార్, సీనియర్ డీఎస్పీ, కోర్సు కో-ఆర్డినేటర్‌గా శ్రీ పి. జ్ఞానేంద్ర రెడ్డి, డీఎస్పీ బాధ్యతలు నిర్వహించారు.
శిక్షణా కార్యక్రమ ప్రారంభోత్సవానికి అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి కవిత హాజరై శిక్షణ ప్రాముఖ్యతను వివరించగా, ముగింపు కార్యక్రమానికి డిప్యూటీ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రస్తుత ట్రాఫిక్ నిర్వహణలో ఈ శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాల ప్రాధాన్యతను వివరించారు.
ముగింపు సందర్భంగా పాల్గొన్న 24 మంది శిక్షణార్థులకు ధృవపత్రాలు అందజేసి అభినందించారు.





