చేస్తా చెప్పకుండా చేస్తా,
చిత్తశుద్ధిని చాటుతూ చాటింపు లేకుండా చేస్తా,
అవసరాన్ని గ్రహించి అడగకుండానే చేస్తా॥
చేస్తా నచ్చితేనే చేస్తా,
న్యాయం తోడైతే నిర్భయంగా ముందుకొచ్చి చేస్తా,
నిబద్ధతతో మాటకు విలువ తెస్తా, నమ్మకంగా చేస్తా॥
చేస్తా చక్కగా చేస్తా,
నైపుణ్యంతో మెప్పులను అందుకుంటా,
తప్పిదాలకు తావులేక సరిగానే చేస్తా, సఫలతను సాధిస్తా॥
చేస్తా సరదాగా చేస్తా,
సంతోషాలను పంచుతూ సాగిపోతూ ఉంటా,
కర్తవ్యాన్ని భుజాన మోస్తా, అంకితభావంతో పూర్తిచేస్తా॥
చేస్తా నాలాగా చేస్తా,
నా ముద్రతో నవ్యతను నింపుతా,
గుండెల్లో నిలిచి గుర్తుండేలా చేస్తా, కీర్తిగా మిగులుతా॥
చేస్తా భారమైనా చేస్తా,
బరువును బలంగా మార్చి విజయపథం చేరుతా,
ఆటంకాలను దాటి కష్టమైనా చేస్తా, సుసాధ్యం చేస్తా॥
చేస్తా ఖర్చైనా చేస్తా,
మంచి పనికి వెచ్చించి మానవతను చాటుతా,
కాలపాలనతో కచ్చితంగా చేస్తా, మచ్చలేక పూర్తిచేస్తా॥
చేస్తా మరవకుండా చేస్తా,
మదిలో నిలుపుకొని నెరవేర్చుతూ ఉంటా,
మనసుపెట్టి చేస్తా, మమతతో ప్రాణం పోసి చేస్తా॥
చేస్తా వట్టిగా చేస్తా,
వంచనలు లేక ఉన్నది ఉన్నట్టు చెబుతా,
గమ్యంపై గురిపెట్టి గట్టిగా ముందుకు సాగుతా॥
చేస్తా మేటిగా చేస్తా,
మేలిమితో చిరస్మరణీయమవుతా,
ధైర్యాన్ని తోడుగా చేసుకొని గెలుపును చేరుతా॥
— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.





