రాజకీయాల్లో ఎన్నికల హామీలు, ప్రజలకు ఇచ్చిన మాటలు తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. అయితే ఇచ్చిన హామీని అమలు చేసి చూపించే నాయకులు మాత్రం అరుదుగానే కనిపిస్తారు. అలాంటి అరుదైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు మరోసారి వార్తల్లో నిలిచారు. యువత, క్రీడాకారుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మినీ స్టేడియం నిర్మాణం కోసం తన సొంత భూమినే కేటాయిస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
వీపనగండ్ల మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణానికి అవసరమైన భూమిని అందజేస్తూ మంత్రి బుధవారం అధికారికంగా డిజిటల్ సంతకాలు చేశారు. ఈ నిర్ణయం స్థానిక యువత, క్రీడాకారుల్లో ఆనందాన్ని నింపగా, ప్రజాప్రతినిధిగా ఇచ్చిన హామీని అమలు చేసినందుకు ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కొంతకాలం క్రితం మంత్రి జూపల్లి కృష్ణారావు వీపనగండ్ల మండల పర్యటనకు వెళ్లిన సందర్భంగా స్థానిక యువత, క్రీడాకారులు ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన క్రీడా మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన క్రీడాకారులు అవకాశాలు కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా వీపనగండ్ల మండలంలో ఒక మినీ స్టేడియం నిర్మిస్తే యువతకు, విద్యార్థులకు, క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు కోరారు. వారి విజ్ఞప్తిని శ్రద్ధగా విన్న మంత్రి, స్టేడియం నిర్మాణానికి అవసరమైన భూమిని తానే సమకూరుస్తానని హామీ ఇచ్చారు.
అప్పట్లో ఇచ్చిన మాటను ఇప్పుడు మంత్రి కార్యరూపంలోకి తీసుకొచ్చారు. వీపనగండ్ల మండల కేంద్రంలోని సర్వే నంబర్ 532/ఆలో తన పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమిని మినీ స్టేడియం నిర్మాణం కోసం అధికారికంగా కేటాయించారు.ఈ భూమి బదలాయింపుకు సంబంధించిన డిజిటల్ సంతకాల ప్రక్రియను పూర్తి చేసి, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి తన వంతు సహకారం అందించారు. వ్యక్తిగత ఆస్తిని ప్రజా ప్రయోజనాల కోసం ఇవ్వడం రాజకీయాల్లో అరుదుగా కనిపించే విషయం కావడంతో ఈ నిర్ణయం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది యువతకు క్రీడల్లో ప్రతిభ ఉన్నప్పటికీ, సరైన మైదానాలు, శిక్షణా సదుపాయాలు లేకపోవడం వల్ల వారు ముందుకు రాలేకపోతున్నారు. వీపనగండ్లలో ప్రతిపాదిత మినీ స్టేడియం అందుబాటులోకి వస్తే స్థానిక క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు లభించనున్నాయి.అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశం ఉండటంతో యువతలో క్రీడల పట్ల మరింత ఆసక్తి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
మంత్రి జూపల్లి తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు, యువత, క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం సాధారణమే అయినప్పటికీ, వాటిని అమలు చేయడం చాలా అరుదుగా జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత భూమిని ప్రజా ప్రయోజనాల కోసం అందించడం ద్వారా జూపల్లి ఆదర్శంగా నిలిచారని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. క్రీడల అభివృద్ధికి ఇది ఒక కీలక అడుగు అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.





