ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓ దశలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన ఢిల్లీ జట్టును యువ బ్యాటర్ సమీర్ రిజ్వీ తన అద్భుత ఇన్నింగ్స్‌తో గెలిపించాడు.లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు ఢిల్లీ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది.
లక్నో తరఫున అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) మాత్రమే కొంత ప్రతిఘటన చూపగా, మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, టి. నటరాజన్ చెరో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆరంభం నిరాశ కలిగించింది. కేఎల్ రాహుల్ (0), నితీశ్ రాణా (15), పతుమ్ నిస్సంక (1), అక్షర్ పటేల్ (0) వరుసగా అవుట్ కావడంతో 4.3 ఓవర్లలోనే 26 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది.
ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన సమీర్ రిజ్వీ అద్భుత పోరాటాన్ని కనబరిచాడు. అతనికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ (39 నాటౌట్) నిలిచాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 119 పరుగులు జోడించి మ్యాచ్‌ను పూర్తిగా ఢిల్లీ వైపు తిప్పారు.రిజ్వీ 47 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి తన కెరీర్లో గుర్తుంచుకునే ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడిని తట్టుకుని క్లాస్ షాట్లతో ప్రేక్షకులను అలరించాడు. స్టబ్స్ కూడా సమయోచితంగా ఆడుతూ జట్టుకు అండగా నిలిచాడు.
వీరిద్దరి అద్భుత భాగస్వామ్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరో వికెట్ కోల్పోకుండా 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు ఐపీఎల్ 2026లో ఢిల్లీకి విశేష ఆత్మవిశ్వాసాన్ని నింపింది.





