‘పెద్ది’ వివాదంపై జయా బచ్చన్ ఫైర్..

Must read

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన తర్వాత జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. సినిమాలో హీరోయిన్ పాత్రను అతిగా గ్లామరస్‌గా చూపించారంటూ సోషల్ మీడియా, సినీ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తుండగా, తాజాగా సీనియర్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్​ ఘాటుగా స్పందించారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమాల్లో మహిళలను కేవలం ఆకర్షణీయమైన వస్తువులా చూపించే ధోరణిని ఆమె తీవ్రంగా ఖండించారు. మహిళా పాత్రలకు కథలో ప్రాధాన్యం ఉండాలని, కేవలం గ్లామర్ కోసం వారిని ఉపయోగించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంలో జాన్వీకపూర్ పాత్రపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని కూడా జయా బచ్చన్ గుర్తుచేసుకున్నారు. ఒక దర్శకుడు తనను కూడా మితిమీరిన గ్లామర్‌తో చూపించేందుకు ప్రయత్నించాడని, అయితే తాను వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశానని చెప్పారు. “నాతో ఆ గీత దాటేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. ఒకసారి అలాంటి ప్రయత్నం జరిగింది. నేను అంగీకరించలేదు. ఆ దర్శకుడితో మళ్లీ ఎప్పుడూ పని చేయలేదు” అని ఆమె స్పష్టం చేశారు.

సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఆమె ప్రస్తావించిన సంఘటన షోర్​ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగినదిగా చెబుతున్నారు. ఆ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించిన మనోజ్​ కుమార్​ తనను ఒక ప్రత్యేక దుస్తుల్లో నటించమని కోరగా, తాను నిరాకరించానని జయా బచ్చన్ పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి.

‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ప్రేక్షకుల అభ్యంతరాల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సాన, మహిళలను అవమానించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ, వివాదాస్పదంగా భావించిన కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేస్తామని ప్రకటించారు.

ఈ వివాదంపై ఇతర సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. మహిళల పాత్రలను గౌరవప్రదంగా చూపించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, సినిమాల్లో సెన్సువాలిటీకి, మహిళల వస్తుకరణకు మధ్య తేడా ఉందని కొందరు ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.

‘పెద్ది’ చుట్టూ కొనసాగుతున్న ఈ చర్చ భారతీయ సినీ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం, పాత్రల రూపకల్పన, కెమెరా చూపు వంటి అంశాలపై మరింత విస్తృతమైన చర్చకు దారితీసింది. మహిళా పాత్రలకు స్వతంత్రత, గౌరవం, కథలో ప్రాధాన్యం ఉండాలనే అభిప్రాయం మరింత బలంగా వినిపిస్తోంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!