సమాజాన్ని కదిలించేది రచయితలేనని మల్కాజిగిరి కమిషనర్ సుమతి అన్నారు. సమాజంలో మార్పుకు, ప్రజల్లో చైతన్యానికి, సామాజిక అవగాహన పెంపొందించడానికి రచయితలు కీలక పాత్ర పోషిస్తారని ఆమె అన్నారు. రచయితల కలం కేవలం సాహిత్య సృష్టికే పరిమితం కాదని, సమాజాన్ని ఆలోచింపజేసే శక్తి కూడా దానిలో ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన ‘మాతృవందన షష్టిపూర్తి కలాలకు సత్కారం’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల్లో సామాజిక అవగాహన పెరిగి, మహిళలు పురుషుల మధ్య సమానత్వం ఏర్పడినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. పిల్లల ముందు తల్లిదండ్రుల నడవడిక పెంచే విధానం వల్లే మార్పులు వస్తాయని సూచించారు. పిల్లలకు ఆస్తులపై కాకుండా చుట్టూ ఉన్నవారిపై ప్రేమానురాగాలు పంచేలా ప్రోత్సాహించాలన్నారు. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే సమయం తగ్గుతుందని, తల్లిదండ్రు పిల్లల కోసం సమయం కేటాయించాలన్నారు.
మాజీ ఐఏఏస్ అధికారి పార్థసారథి మాట్లాడుతూ అక్షరయాన్ సమిష్టిగా కృషి చేస్తూ రెండు తెలుగు రాష్ర్టాల్లో 1500 మందికి పైగా రచయితలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిందన్నారు. ఇంతమంది కలుపుకోవడం గొప్ప విషయమని అక్షరయాన్ నిర్వాహక అధ్యక్షురాలు అయినంపూడి పుడి శ్రీలక్ష్మిని కొనియాడారు. అక్షరాయన్ గత ఐదు సంవత్సరాలుగా ఎంతో మంది మహిళా రచయితలను మాతృవందనంలో సన్మానిస్తుందని ఇది గొప్ప విషయమన్నారు. ఆడామగ సమానమనే విషయాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు అవగామన కల్పించాలన్నారు. ఆడ పిల్లల్ని తక్కువగా చూడడం, మగ పిల్లల్ని ఎక్కువగా చూడడం ఇండ్లల్లో చేయకూడని సూచించారు. ఆడైనా మగైనా సరి సమానంగా పెంచాలన్నారు.
తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలుగులో అ అనే పదానికి ప్రత్యేకత ఉందని అ అంటే అమ్మా అని ఆ అంటే అక్షరమని అన్నారు. అమ్మల దినోత్సవాన్ని చేసేదాంట్లో కూడా రెండు అలు ఉన్నాయని అవి అక్షరయాన్ అభిజ్ఞ భారతీ అనే రెండు సంస్థలన్నారు.. మనం ఇప్పటికీ అ దగ్గరే ఆగిపోయామని, ఇంకా మనకు అ నుంచి ఱ వరకు నేర్చుకోవాలని, కానీ మనం అ దగ్గరే ఎందుకు ఆగిపోయామంటే మానవాళి అభివృద్ధి చెందడానికి, వికాసం చెందడానికి అత్యంత అద్భుతమైన ప్రగతి సాగించడానికి అ ఒక్కటి చాలు అన్నారు.
మనం భౌతికంగా మాత్రమే అ నుంచి ఱ వరకు నేర్చుకున్నామని, ఇంకా మనం పూర్తిగా అను కూడా నేర్చుకోలేమన్నారు. అలా నేర్చుకున్న అమ్మలకు రచయితలకు నేడు సన్మానిస్తున్నామన్నారు. ఒక్క అక్షరం మనల్ని చైతన్యవంతం చేస్తుంది. విధి నిర్వాహణలో ఉత్పేరకంగా పనిచేస్తుందన్నారు. మన లక్ష్యం వైపుకు నడిపిస్తుందన్నారు.అక్షరం అంటే క్షరం లేనిదన్నారు. సాహిత్యం అనేది తెరపీ అన్నారు.
అయినంపూడి శ్రీలక్ష్మీ మాట్లాడుతూ రచనలు భవిష్యత్తు తరాలకు ఆస్తులన్నారు. ఈ కార్యక్రమంలో 70 సంవత్సరాలు దాటిన అమ్మలకు సన్మాం చేస్తున్నామని, గత ఐదు సంవత్సరాలుగా మేము ఈ సత్కారాలు చేస్తున్నాము.. ఇది మాకు దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం రచయితలకు ఘనంగా సన్మానించి అవార్డులు అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, కె. వికాస్, డాక్టర్ లకుమాదేవి, ఆలూరి విజయలక్ష్మీ, అవార్డు గ్రహితలు, రచయితలు, కవులు తదితరులు పాల్గొన్నారు.





