కూటమి ప్రభుత్వం రాక నిస్తేజంలో కూరుకుపోయిన నేతన్నకు భరోసానిచ్చింది. గత రెండేళ్ల కాలంలో చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అంపశయ్యపై ఉన్న చేనేత పరిశ్రమ అభివృద్ధి పథంలోకి పయనించసాగింది. ఒకవైపు నూతన టెక్స్ టైల్స్ పాలసీ, మరోవైపు వ్యక్తిగత లబ్ధి పొందేలా పథకాల అమలు, ఇంకోవైపు చేనేత సహకార సంఘాల బలోపేతానికి చర్యలతో డీలా పడిన చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం జవసత్వాలు నింపింది.
నేను కూలీని కాదు కళాకారుడిని అని నేతన్నలు కాలెరగేసేలా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది, ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. చేనేత రంగాన్ని ఆదుకున్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు సైతం నేతన్నలకు లబ్ధి కలిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవతో మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు, గౌరవం దక్కింది.
2024లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం చేనేతలకు అండగా నిలిచింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 92,724 మంది నేతన్నలకు రూ.3 వేల నుంచి రూ. 4 వేలకు పెన్షన్ పెంచారు. చేనేతలకు త్రిఫ్ట్ కింద ప్రభుత్వ వాటాను 8 నుంచి 16 శాతానికి పెంచారు. ఈ పథకం కింద 2024-25లో రూ.5 కోట్లు, 2025-26లోనూ మరో రూ.5 కోట్లు కేటాయించారు. త్రిఫ్ట్ పథకం ద్వారా 5,726 మందికి లబ్ధి కలిగింది. రెండేళ్లలో రూ.65.35 కోట్ల మేర ముద్ర రుణాలను 6,808 మందికి అందజేశారు.
జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్.హెచ్.డి.పి)పథకం ద్వారా చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.10.44 కోట్లను వెచ్చించగా, 7,500 మంది చేనేతలకు లబ్ధి కలిగింది. రూ.175 కోట్లతో ముడి పదార్థాల సరఫరా పథకం ద్వారా నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ అందజేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చేనేత ఉత్పత్తుల 5 శాతం జీఎస్టీ రియింబర్స్ మెంట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న చేనేత మహిళలకు రూ.10 వేలు విలువ చేసే నూలును అందజేస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.78.73 కోట్ల నగదు పరపతి సౌకర్యం కల్పించారు. ఆధునిక పనిముట్ల కొనుగోలుకు 90 శాతం వరకు సబ్సిడీతో పాటు క్యాష్ క్రెడిట్ పథకం కింద సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నారు.
గత ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు స్వయంగా నేతన్నల కష్టాలను తెలుసుకుని, ఉచిత విద్యుత్ అందజేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏడాదికి రూ.150 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం వెచ్చిస్తోంది. సుమారు 1.04 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ది కలుగనుంది. పథకం ద్వారా ఏడాదికి మగ్గం నేతన్నలకు రూ.8,640లు, మర మగ్గం నేతన్నలకు రూ.21,600లు ఆదా అవుతోంది.
నేటితరం అభిరుచులకు అనుగుణంగా చేనేత వస్త్రాల తయారీలో 5 జిల్లాల్లో నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. కలంకారి చీరలు, పెన్ కలంకారి చీరలు, దుపట్టాలు, డిజిటల్ ప్రింటెడ్ చీరలు, క్రోచెట్ లేస్ చీరల తయారీలో శిక్షణ అందజేశారు. ఆప్కో షో రూముల్లో రెడీమేడ్ చేనేత వస్త్రాలను అమ్మకాలు ప్రారంభించారు. వెల్క్రో ధోవతులు, కాటన్ రెడీమేడ్ పెళ్లికూతురి ధోవతులు, మోడీ జాకెట్లు, సిల్క్ పెళ్లికూతురి సెట్లు, కొత్త డిజైన్లతో రెడీమేడ్ షర్టులు, లెనిన్ షర్టుల సహా వందకు పైగా డిజైన్లతో చేనేత రెడీమేడ్ వస్త్రాలను అమ్మకాలు చేస్తున్నారు.
మారిన అభిరుచుల నేపథ్యంలో యువత, మహిళలు చేనేత వస్త్రాల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. ఆన్ లైన్ లోనూ చేనేత రెడీమేడ్ దుస్తులు,ఇతర వస్త్రాలను విక్రయిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 40 ఆప్కో షో రూమ్స్ ద్వారా 6,770 ఉత్పత్తులను అమ్మకాలకు పెట్టారు. ఈ కామర్స్ అమ్మకాలతో నేరుగా వినియోగదారుల ఇళ్లకే వస్త్రాలను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఆప్కో పేరిట సొంత వెబ్ సైటును అందుబాటులోకి తీసుకొచ్చారు. చేనేత వస్త్రాల పై సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం చేస్తూ, నేటి తరానికి నేతన్నలను కూటమి ప్రభుత్వం మరింత దగ్గర చేస్తోంది.
గడచిన రెండేళ్ల కాలంలో చేనేత రంగానికి ఊపిరి పోసేలా కూటమి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుందని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. చేనేత కార్మికులకు గౌరవ జీవనం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సగం ధరకే చీర, దోవతి నినాదంతో ఆనాడు అన్న ఎన్టీఆర్ చేనేత రంగానికి ఊపిరిపోస్తే, నేడు సీఎం చంద్రబాబు నేతన్నలకు ఆర్థిక మేలు కలుగజేసేలా పథకాలు రూపొందిస్తున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యంగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించేలా కూటమి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని మంత్రి వివరించారు.
గత నెల ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకంతో నేతన్న కుటుంబాలకు మరింత లబ్ధి కలుగుతోందని చెప్పారు. చేనేతలకు 365 రోజుల పాటు పని కల్పించడమే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. ఆ లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి సవిత చెప్పారు.





