గోబెల్స్ లా తప్పుడు ప్రచారం చేయడంలో జగన్ సిద్ధహస్తుడు

Must read

ఆక్వా రైతుల సమస్యలపై నిజాలను పక్కనపెట్టి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడం, గోబెల్స్ లా తప్పుడు ప్రచారం చేయడం ఎమ్మెల్యే జగన్‌కు అలవాటుగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు మాట్లాడాలని, కానీ రాజకీయ లాభాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తూ రైతులను మానసిక ఆందోళనకు గురిచేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని అన్నారు. ఆక్వా రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని, ఫీడ్ కంపెనీలతో కుమ్మక్కై రైతులను నష్టపరుస్తోందని జగన్ చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలు వస్తే పరిష్కారం చూపడం నాయకుడి బాధ్యత. కానీ ప్రజల్లో భయం పుట్టించి, రాష్ట్రంపై ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు పంపించడం జగన్ రాజకీయ విధానంగా మారిపోయింది. రైతుల పేరుతో రాజకీయ నాటకాలు ఆడటం మానేసి, ముందు తన పాలనలో ఆక్వా రంగాన్ని ఎలా నష్టపరిచారో ప్రజలకు సమాధానం చెప్పాలి అని మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టుగా జగన్ ఇప్పటికీ అదే అవినీతి మైండ్‌సెట్‌తో మాట్లాడుతున్నారు. గ‌తంలో వైసీపీ పాలనలో ఫీడ్ తయారీ సంస్థల దగ్గర మీ ప్ర‌భుత్వం ఎంత కమీష‌న్లు తీసుకున్నారో అలానే ఈ ప్ర‌భుత్వం కూడా తీసుకుని ఉంటుంద‌న్న‌ భ్ర‌మ‌లో జ‌గ‌న్ ఉన్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ధరలు పెరిగిన గంటల్లోనే స్పందించిన ప్రభుత్వం… భయపడి వెనక్కి తగ్గిన కంపెనీలు

ఆక్వా ఫీడ్ ధరల పెంపు విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించిందని మంత్రి స్పష్టం చేశారు. మ‌త్స‌శాఖ కమిషనర్ ద్వారా వెంటనే నోటీసులు జారీ చేశాం. ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోందని తెలుసుకున్న ఫీడ్ కంపెనీలు వెనక్కి తగ్గుతూ ధరల పెంపును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేశాయి. రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవన్నీ కనిపించకుండా రాజకీయ డ్రామాలు చేయడం మానుకోవాలి అని అన్నారు. శుక్రవారం APSADA చట్టంపై కీలక సమావేశం నిర్వహించి, ఫీడ్ తయారీ సంస్థలు, రైతులు, అధికారులతో చర్చించి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

జ‌గన్ పాల‌న‌లో ఆక్వా రైతుల జీవితాలు బుగ్గిపాలు అయ్యాయి

జగన్ పాలనలో ఆక్వా రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలు, డీజిల్ ధరలు, రవాణా వ్యయాలు, ఫీడ్ ధరలు పెరిగి రైతులు అప్పుల పాలయ్యారు. ఎన్నో కుటుంబాలు నష్టాలతో కుదేలయ్యాయి. చెరువులు మూతపడ్డాయి. ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఫిషరీస్ శాఖను నిర్వీర్యం చేసింది మీ ప్రభుత్వమే అని విమర్శించారు. 1.50 రూపాయలకు యూనిట్ విద్యుత్ ఇస్తామని చెప్పి ‘10 ఎకరాల పరిమితి’, ‘జోన్-నాన్ జోన్ వంటి నిబంధనలను పెట్టి ఏ రైతుని కూడా రైతులను ఇబ్బందులకు గురిచేశారు. మీ పాలనలో ఆక్వా రైతుల జీవితాలు బుగ్గిపాలు అయ్యాయి. రైతుల భవిష్యత్తుతో ఆడుకున్న వారు ఇప్పుడు రైతుల రక్షకుల్లా మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు.

ప్రతి రైతుకు అండగా కూట‌మి ప్రభుత్వం

వైసీపీ ప్ర‌భుత్వం పెట్టిన జోన్ – నాన్ జోన్ విధానాన్ని తొల‌గించి కూట‌మి ప్రభుత్వం జోన్, నాన్ జోన్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంలో APSADA చట్టం ఉన్నప్పటికీ కేవలం 15 శాతం మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయని, ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలిగించే నిబంధనలను తొలగించి 83 శాతం పైగా రిజిస్ట్రేషన్లు సాధించిందన్నారు. అదేవిధంగా 1.65 లక్షల ఎకరాలను ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకువచ్చి, రైతులకు సులభంగా లైసెన్సులు లభించేలా చర్యలు చేపట్టామని వివరించారు. మేత ధరల నియంత్రణ, విద్యుత్ సబ్సిడీ, మార్కెట్ స్థిరీకరణ, కనీస మద్దతు ధరలు, ఆక్వా క్లస్టర్ల అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాల ద్వారా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందన్నారు. జగన్ చెప్పే అబద్ధాలను నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ఇక లేదు. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల వచ్చిన సమస్యలను ప్రభుత్వం బాధ్యతగా ఎదుర్కొంటోంది. కానీ రైతుల ఆందోళనను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం మానేయండి. రైతులను నాశనం చేసి ఇప్పుడు వారి పేరుతో రాజకీయ డ్రామాలు చేయడం ఆపండి. ప్రజలు అన్నీ గుర్తుంచుకున్నారు అని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!