విజయవాడ కానూరులోని సివిల్ సప్లైస్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం రబీ ధాన్యం సేకరణ పై మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బీ ధాన్యం సేకరణలో పౌరసరఫరాల శాఖ ప్రణాళిక, సన్నద్ధత క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఈ రబీలో రికార్డు స్థాయిలో అన్ని జిల్లాల్లోనూ ధాన్యం సేకరణ చేయగలిగామన్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనేందుకు కూడా అనుమతి ఇవ్వడం వల్ల, దానిని బొండాలు రకం ధాన్యం కొనేందుకు ఉపయోగించుకోవడం ద్వారా వేలాది మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. రబీ సీజన్లో ఎన్టీఆర్ జిల్లాలో కొన్నిచోట్ల ప్రాధాన్యం లేని వరి రకం ముఖ్యంగా 1010, PR 126 వేయడం వల్ల అధికంగా బ్రోకెన్ రైస్ సమస్య వస్తోందన్నారు.
సాధారణ రకం ధాన్యానికి 25 శాతం వరకు బ్రోకెన్ రైస్ వస్తే, ప్రాధాన్యం లేని 1010, PR 126 రకానికి 45 నుంచి 50 శాతం మేర బ్రోకెన్ రైస్ వస్తోందని, ఇది మా అధికారుల అధ్యయనంలో తేలిందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ రకం ఎక్కువగా పండించడంతో ఈసారి దిగుబడి పెరగడంతో పాటు, తరుగు విషయంలో కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.
గతంలోనే ప్రభుత్వం ఈ రెండు రకాలను అప్రాధాన్య రకాలుగా గుర్తించి, పంట వేయవద్దని చెప్పినా రైతులు అధిక దిగుబడి వస్తోందనే ఆశతో వేస్తున్నారన్నారు. వారిని నిరాశపరచకూడదని ఈ ఏడాది కూడా ఆ రకం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. అయితే ఈ ఏడాది ఈ రెండు రకాల వల్ల వచ్చే ఇబ్బందులను వివరిస్తూ రైతుల్లో అవగాహన కల్పించేలా వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకొని ముందస్తుగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
రెండు లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ను ప్రభుత్వం తొలిసారి కొనడం వల్ల వేలాది మంది రైతులకు మేలు కలుగుతుంది, దీంతో పాటు 10 శాతం బ్రోకెన్ రైస్ ను కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటివరకు రబీలో 27 ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో భాగంగా ఇప్పటివరకు 19. 70 లక్షల ధాన్యం సేకరించామన్నారు. మరో నెల రోజులు పాటు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటివరకు రూ.4,600 కోట్ల ధాన్యం సొమ్మును 1.90 లక్షల మంది రైతుల ఖాతాలో విజయవంతంగా 24 గంటల్లోనే వేయగలిగామన్నారు.
2023-24 రబీ సీజన్ కు సంబంధించి అప్పట్లో ఇదే మే నెలలో కేవలం 10.04 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రబీ సీజన్ అంటే గత సంవత్సరం మే నాటికీ 16.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ రబీ సీజన్లో 19.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అధికమన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలోని రబీలో కొనుగోలు చేసిన దానితో పోలిస్తే 57 శాతం అధికంగా ఉందన్నారు. ప్రతి ఏటా ధాన్యం కొనుగోళ్లలో రికార్డులు సృష్టిస్తున్నామని, ఎంత భారీగా ధాన్యం కొన్నా సరే క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు..
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా బ్యాక్ లాగులు కొనసాగుతున్నాయని మా దృష్టికి వచ్చిందన్నారు.. దీంతోపాటు ఇస్టానుసారం వ్యవహరించే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు మీద కఠినంగా వ్యవహారిస్తున్నామన్నారు. ఎప్పటికి అప్పుడు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నామన్నారు. సగటున రోజుకు 1.83 లక్షల బుకింగ్స్ అవుతూ ఉంటే, 1.89 లక్షల గ్యాస్ బండలు డెలివరీ జరుగుతోందన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర బ్యాక్ లాగులు కనిపిస్తున్నాయన్నారు.
దీనిని త్వరలోనే పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని, గ్యాస్ బుక్ చేసిన 4 రోజుల్లో డెలివరీ అయ్యేలా చూస్తామని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయన్నారు. ఇక రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్రోల్ బంకుల డ్రై అవుట్ అవుట్ సమస్య లేదన్నారు. 21 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని అని మంత్రి మనోహర్ తెలియచెప్పారు.





